ఈఎస్‌ఐ డయోగ్నోస్టిక్ సెంటర్‌లో భయం..భయం..!
● శిథిలావస్థలో ఈఎస్‌ఐ డయోగ్నోస్టిక్ సెంటర్
● బిక్కుబిక్కు మంటున్న వైద్యసిబ్బంది
● ఆందోళనలో ఆస్పత్రికి వచ్చే కార్మికులు
విజయనగరం ఫోర్ట్: జిల్లాలోని కార్మికులకు చికిత్స అందించడం కోసం ఏర్పాటు చేసిన ఈఎస్‌ఐ డయోగ్నోస్టిక్ సెంటర్‌లో భయానక వాతావరణం నెలకొంది. దీంతో ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చే కార్మికులతో పాటు ఆస్పత్రిలో పనిచేసే ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. డయోగ్నోస్టిక్ సెంటర్ భవనాలు శిథిలావస్థకు చేరాయి. దీంతో భవనాల నుంచి పెచ్చులు ఊడుతున్నాయి. ఈ క్రమంలో ఎప్పుడు ఏ భవనం కూలుతుందోనని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఆస్పత్రికి వచ్చే రోగులు కూడా భవనం దుస్థితి చూసి భయపడుతున్నారు. డయోగ్నోస్టిక్ సెంటర్ పరిధిలో 19 వేల మంది కార్మికులు ఉన్నారు. వివిధ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు ఏదైనా అనారోగ్య సమస్య వస్తే డయోగ్నోస్టిక్ సెంటర్‌కు వస్తారు. రోజుకి 50 మంది వరకు కార్మికులు చికిత్స కోసం ఇక్కడికి వస్తారు. డయోగ్నోస్టిక్ సెంటర్‌లో ఆర్థో, జనరల్ మెడిసిన్, గైనిక్, జనరల్ సర్జరీ, పిడియాట్రిక్, డెంటల్, ఈఎన్‌టీ తదితర విభాగాలు ఉన్నాయి.
కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం
ఈఎస్‌ఐ పరిధిలో ఉన్న కార్మికుల పట్ల చంద్రబాబు ప్రభుత్వం అలసత్వం వహిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వసతి సమస్యతో ఈఎస్‌ఐ డయోగ్నోస్టిక్ సెంటర్ సిబ్బంది ఇబ్బంది పడుతున్నప్పటికీ చంద్రబాబు సర్కారు పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డయోగ్నోస్టిక్ సెంటర్ శిథిలావస్థకు చేరి ఉద్యోగులు, కార్మికులు ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే వాపోతున్నారు. భవనాలు శిథిలావస్థకు చేరడంతో డయోగ్నోస్టిక్ సెంటర్‌లో సమస్యలను కూడా చంద్రబాబు సర్కారు పట్టించుకోవడం లేదు. డయోగ్నోస్టిక్ సెంటర్‌లో ఏడాదిన్నరగా రేడియాగ్రాఫర్ లేక కార్మికులు ఇబ్బంది పడుతున్నా పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు. దీంతో ఎక్స్‌రే అవసరమైన కార్మికులు ప్రైవేట్ స్కానింగ్ సెంటర్స్‌కు వెళ్లాల్సిన పరిస్థితి. రేడియాగ్రాఫర్‌ను నియమించాలని డయోగ్నోస్టిక్ సెంటర్ వైద్యాధికారులు పలుమార్లు ప్రభుత్వానికి లేఖలు రాసినా ఫలితం లేకపోయింది.
సెంటర్ మార్చేందుకు చర్యలు
డయోగ్నోస్టిక్ సెంటర్ భవనాలు శిథిలావస్థకు చేరడంతో వేరే చోటకు మార్చడానికి చర్యలు తీసుకుంటున్నాం.రేడియో గ్రాఫర్‌ను నియమించాలని ఉన్నతాధికారులకు లేకరాశాం.
డాక్టర్ చక్రవర్తి, సూపరింటెండెంట్, ఈఎస్‌ఐ డయోగ్నోస్టిక్ సెంటర్


