విశాఖ బయల్దేరిన కార్మిక బృందాలు
● సీఐటీయూ మహాసభల ముగింపు
సమావేశానికి హాజరు
విజయనగరం గంటస్తంభం: కార్మిక వర్గ హక్కుల సాధన కోసం 1970 నుంచి నిరంతర పోరాటం సాగిస్తున్న సీఐటీయూ 18వ అఖిల భారత మహాసభలు డిసెంబర్ 31 నుంచి 2026 జనవరి 4 వరకు విశాఖపట్నంలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ మహాసభల ముగింపులో భాగంగా జనవరి 4న నిర్వహించనున్న మహాప్రదర్శన, బీచ్‌లో జరిగే బహిరంగ సభకు విజయనగరం జిల్లా నుంచి వేలాది మంది కార్మికులు విశాఖకు తరలివెళ్లారు. ఈ సందర్భంగా విజయనగరం నుంచి బయలుదేరిన వాహనాలను సీఐటీయూ నగర ఉపాధ్యక్షుడు రెడ్డి శంకరరావు జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో సీఐటీయూ నగర అధ్యక్షుడు జగన్మోహన్ రావు మాట్లాడుతూ, రాబోయే కాలంలో కార్మిక వర్గం ఐక్యంగా మోడీ ప్రభుత్వ కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని ఈ మహాసభలు పిలుపునిచ్చాయని తెలిపారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను నిలిపివేయడం, నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయడం కోసం ఉద్యమాలను ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ అఖిల భారత మహాసభలు కార్మిక శక్తి ఐక్యతను చాటే వేదికగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఎల్బీజీ నగర్, గురజాడ నగర్, వినాయక నగర్ ప్రాంతాల నుంచి ఐద్వా కార్యకర్తలు, కార్మికులు టాటా ఏస్ వాహనాల్లో విశాఖకు బయలుదేరారు. ఈ కార్యక్రమాన్ని ఐద్వా జిల్లా కార్యదర్శి పి.రమణమ్మ, సీఐటీయూ నగర కార్యదర్శి బి.రమణ ఆధ్వర్యంలో నిర్వహించారు. అలాగే ఏపీ బెవరేజెస్, సిమెంట్ కలాసీలు, క్రాంతి జట్టు కలాసీలు కోట ప్రాంతం నుంచి తరలివెళ్లారు. కార్యకరమంలో అంగన్‌వాడీ, ఆటో, కలాసీలు తదితర కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.


