జిల్లా స్థాయి నృత్య పోటీలు
పార్వతీపురం: సంక్రాంతిని పురష్కరించుకొని మండల, జిల్లా స్థాయిలో నృత్య పోటీలను నిర్వహించనున్నట్టు కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ జిల్లాలోని కళాకారులను ప్రోత్సహించేలా పోటీలను నిర్వహించనున్నట్టు తెలిపారు. గిరిజన సంస్కృతిని ప్రతిబింబించేలా జానపద, శాసీ్త్రయ నృత్యాలు, గీతాలకు అనుమతి ఉంటుందన్నారు. 15 ఏళ్లలోపు బాలబాలికలు మొదటి విభాగంలోను, 16ఏళ్లు పైబడిన వారు రెండో విభాగంలో ఉంటారన్నారు. పోటీల్లో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్నవారు తమ పరిధిలోని ఎంపీడీఓ కార్యాలయంలోని పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. మండల స్థాయి పోటీలను ఈ నెల 7వ తేదీలోగా పూర్తి చేసి విజేతల వివరాలను జిల్లా కేంద్రానికి పంపాలన్నారు. డీఈఓ పర్యవేక్షణలో మండల స్థాయిలో ప్రతిభ చాటిన విజేతలకు జిల్లా స్థాయి పోటీలను నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. విజేతలకు సంక్రాంతి సంబరాలలో బహుమతులను అందజేస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని నృత్యకారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.


