మత్తును వీడుదాం.. ముందుకు సాగుదాం..
పార్వతీపురం రూరల్: యువతరం మత్తు కోరల్లో చిక్కుకోకుండా, మహోన్నత లక్ష్యాల వైపు పయనించాలనే సంకల్పంతో శనివారం జిల్లా కేంద్రంలో 3కే రన్ ఉత్సాహంగా సాగింది. విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టీ రూపకల్పన చేసిన అభ్యుదయం సైకిల్ యాత్ర ముగింపు వేడుకలను పురస్కరించుకుని, ఎస్పీ మాధవ్‌రెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఏఎస్పీ మనీషా రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన పరుగులో విద్యార్థులు, పోలీసులు కదం తొక్కారు. పట్టణంలోని కొత్తవలస ఎస్వీడీ కళాశాల నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా బెలగం జూనియర్ కళాశాల వరకు సాగింది. ఆర్టీసీ కూడలి వద్ద విద్యార్థులు మానవహారంగా ఏర్పడి, డ్రగ్స్ వద్దు బ్రో అంటూ చేసిన నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ.. యువత తమలోని శక్తిని వ్యసనాలకు ధారపోయకుండా, క్రీడల వైపు మళ్లించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
జిల్లా కేంద్రంలో
ఉత్సాహంగా 3కే రన్
ఏఎస్పీ మనీషారెడ్డి


