నోటు పుస్తకాలు అందజేసిన కలెక్టర్
విజయనగరం, అర్బన్: పాఠశాల విద్యార్థులకు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి నోట్ పుస్తకాలు అందజేశారు. నూతన సంవత్సరం సందర్భంగా పూల బొకేలు బదులుగా నోట్ పుస్తకాలతో తమకు శుభాకాంక్షలు తెలియజేయాలని కలెక్టర్ సూచించిన విషయం తెలిసిందే. దీంతో జిల్లా అధికారులంతా కలెక్టర్‌కు విభిన్నంగా నోట్ పుస్తకాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఇలా వచ్చిన సుమారు నాలుగు వేల నోటు పుస్తకాలను డీఈఓ మాణిక్యంనాయుడు సమక్షంలో విద్యాశాఖ అధికారులకు శనివారం తమ క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ అందజేశారు. విజయనగరం, గంట్యాడ, బొండపల్లి మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న నాలుగు, ఐదు తరగతి విద్యార్థులకు ఈ నోట్ పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్.సేధు మాధవన్, విజయనగరం ఎంఈఓ లలిత కుమారి, ఏసీ సన్యాసిరాజు పాల్గొన్నారు.
టెక్నికల్ ఉద్యోగుల నైపుణ్యానికి ప్రభుత్వ సర్టిఫికెట్లు
విజయనగరం గంటస్తంభం: జిల్లాలోని వివిధ ప్రైవేట్ కంపెనీల్లో పని చేస్తున్న టెక్నికల్ అభ్యర్థులకు ప్రభుత్వం సర్టిఫికెట్లు జారీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా ప్రభుత్వ ఐటీఐ కన్వీనర్, ప్రిన్సిపాల్ టి.వి.గిరి తెలిపారు. అప్రెంటిషిప్ యాక్ట్, ఫ్యాక్టరీస్ యాక్ట్–1948(ఎంఎస్‌ఎంఈ) కింద నమోదైన ప్రైవేట్ సంస్థల్లో టెక్నికల్ సంబంధిత ట్రేడ్‌లో కనీసం మూడేళ్ల అనుభవం ఉన్నవారు అర్హులన్నారు. దరఖాస్తుదారులు నిర్దేశిత కనీస విద్యార్హతతో పాటు 21 సంవత్సరాల వయసు ఉండాలని, వయసు పరిమితి లేదని తెలిపారు. 2019లో ఎస్‌సీవీటీ పాసై, అప్రెంటిస్ పోర్టల్‌లో నమోదై ఉండాలని తెలిపారు. అర్హులైన అభ్యర్థులు సమీప ప్రభుత్వ ఐటీఐల్లో ఈ నెల 28లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు అందజేస్తామని, ఇవి ఉద్యోగాల్లో పదోన్నతులకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. వివరాలకు 9849944654, 9703179119 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.


