బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం
విజయనగరం లీగల్: 18 సంవత్సరాల్లోపు బాల బాలికలకు వివాహం చేయటం చట్టరీత్యా నేరమని, అందుకు రెండు సంవత్సరాలు జైలుశిక్షతో పాటు జరిమానా ఉంటాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత అన్నారు. రాష్ట్ర న్యాయసేవాఽధికార సంస్థ ఆదేశాల మేరకు శనివారం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ అనేక కారణాలు వల్ల చిన్న వయస్సులోనే వివాహాలు చేయటం సరైనది కాదన్నారు. చిన్న వయస్సులోనే వివాహాలు చేయటం వల్ల అనారోగ్య సమస్యలతో పాటు శారీరక సమస్యలు ఏర్పడతాయన్నారు. ముఖ్యంగా బాల బాలికల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని అంగన్‌వాడీ, ఆశా వర్కర్లు, పారా లీగల్ వాలంటీర్స్ కృషి చేయాలన్నారు. చైల్డ్ లైన్ టోల్‌ఫ్రీ నంబరు 1098కు లేదా జాతీయ న్యాయసేవా అధికార సంస్థ టోల్‌ఫ్రీ 15100 నంబరుకు ఫోన్ చేసి తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటక్షన్ ఆఫీసర్ బిహెచ్.లక్ష్మి, డిస్ట్రిక్ మిషన్ కో ఆర్డినేటర్ ఎల్ సుజాత, నేచర్ ఎన్జఓ కో ఆర్డినేటర్ దుర్గ, అంగన్‌వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత


