గురజాడ గృహ పరిరక్షణకు రూ.12.05 లక్షలు మంజూరు
● మంత్రి కొండపల్లి శ్రీనివాస్
విజయనగరం అర్బన్: తెలుగు జాతికి గర్వకారణమైన ప్రముఖ సంఘసంస్కర్త, సాహిత్య యుగపురుషుడు గురజాడ అప్పారావు చారిత్రక గృహాన్ని సాంస్కృతిక వారసత్వ సంపడగా భావించి దాని పరిరక్షణకు ప్రభుత్వం కుట్టుబడి ఉందని ఎంఎస్‌ఎంఈ, ఎన్‌ఆర్‌ఐ సాధికారత శాఖ మంత్రి కొండపల్ల శ్రీనివాస్ తెలిపారు. గురజాడ గృహానికి తగిన రక్షణ లేక ఆకతాయిలు లోపలికి ప్రవేశిస్తున్నారనే విషయాన్ని గురజాడ వారసులు వెంకట ప్రసాద్, ఇందిర దంపతులు ఈ నెల 25న తన దృష్టికి తీసుకొచ్చారని మంత్రి పేర్కొన్నారు. దీనిపై తాను వెంటనే స్పందించి కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ నల్లనయ్యతో చర్చించానని చెప్పారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మున్సిపల్ ఇంజినీర్ గురజాడ గృహాన్ని పరిశీలించి అంచనాలు రూపొందించగా వాటిని పరిశీలించిన అనంతరం గృహ పునరుద్ధరణ, భద్రత చర్యల కోసం మొత్తం రూ.12.05 లక్షలు మంజూరు చేసినట్లు మంత్రి కొండపల్లి వెల్లడించారు. ఈ గృహం కలకాలం నిలిచి గురజాడ ఆలోచనలు, ఆదర్శాలు భావితరాలకు మార్గదర్శకంగా నిలవాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.


