పసుపు ధర ఢమాల్
సీతంపేట: ఏజెన్సీలో పండే పసుపు నాణ్యతతో కూడినది. కేవలం సేంద్రియ ఎరువులతో సాగుచేసిన పంట కావడంతో డిమాండ్ ఎక్కువ. ఇక్కడి పసుపు కొమ్ములు కొనుగోలుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వ్యాపారులు తరలివస్తారు. సీజన్ ఆరంభమై పక్షం రోజులైంది. ఈ దఫా ఏజెన్సీలో విలువైన పసుపు పంటకు మాత్రం రైతులు ఆశించిన ధరలు మర్కెట్‌లో లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఉడకబెట్టి తెచ్చిన పసుపు కావిడ ధర ప్రస్తుతం రూ.700 నుంచి రూ.800 మధ్య ధర పలుకుతోంది. గతంలో రూ.900 ఉండేదని, పక్షం రోజుల్లో కావిడ వద్ద రూ.200 ధర తగ్గడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.
అంతర పంటగా...
సీతంపేట ఏజెన్సీలో సుమారు 1250 ఎకరాల్లో పసుపు సాగవుతోంది. సుమారు 2 వేల మంది రైతులు కొండపోడులో పంటను సాగుచేస్తున్నారు. జీడీ, మామిడి తోటల్లో అంతరపంటగా సాగుచేస్తున్న పసుపు పంట రైతులకు ప్రధాన ఆదాయ వనరు. గతంలో ఐటీడీఏ ఉద్యానవన సాగులో భాగంగా విత్తనాలు సరఫరా చేసేది. గిట్టుబాటు ధర ఉండడంతో గిరిజన రైతులకు లాభాలు వచ్చేవి. ఈ ఏడాది నాణ్యమైన పసుపు దిగుబడి వచ్చినా ధరలు లేక నష్టాలు ఎదురవుతున్నాయని రైతులు చెబుతున్నారు. విశాఖపట్నం, విజయనగరం, రాజమండ్రికి చెందిన వ్యాపారులు వారపు సంతలకు వచ్చి పసుపు కొనుగోలు చేస్తారు. అయితే, దళారీలు సిండికేట్‌గా పంటను చౌకగా దోచుకుంటున్నారని రైతులు వాపోతున్నారు.
కొనుగోలు కేంద్రాలు నిల్....
గతంలో వెలుగు ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి పసుపు రైతులు నష్టపోకుండా మహిళా సంఘాలు పంటను కొనుగోలు చేసేవి. అప్పట్లో కూడా దళారీలు ప్రమేయం ఉండడం, అనుకున్న స్థాయిలో పసుపు కొనుగోలు చేయలేక వెలుగు అధికారుల కూడా చేతులెత్తేశారు. వనధన్ కేంద్రాలు రెండు, మూడు చోట్ల నామమాత్రంగానే పనిచేస్తున్నాయి. మార్కెటింగ్ సదుపాయం లేక ఇవి ఎక్కువ మొత్తంలో పసుపు సేకరించడంలేదని రైతులు చెబుతున్నారు. గిరిజన సహకార సంస్థ ఉన్నా ఫలితం లేదని వాపోతున్నారు.
ఈ ఏడాది నష్టాలే చవిచూస్తున్నాం. ఆరుగాలం శ్రమించి పండించిన పసుపు పంటకు కూడా మద్దతు ధర లేదు. ఏం చేయా లో తెలియడంలేదు. మోంథాతుఫాన్ వర్షాలకు పాడైన పంటలకు ఇప్పటివరకు పరిహారం అందలేదు. అన్నదాత సుఖీభవా వంటి వి అందలేదు. ఇప్పుడు పసుపు పంటకు ధర ఉంటే చాలనుకున్నాం. మద్దతు ధర లేకపోవడంతో దిగాలు పడుతున్నాం.
– ఎస్.ముఖలింగం, జజ్జువ
కావిడ ధర రూ.900 నుంచి రూ.700కు పతనం
సీతంపేట ఏజెన్సీలో 1250 ఎకరాల్లో పసుపు సాగు
దిగుబడి పెరిగినా ధరలు లేవంటూ
గిరిజన రైతుల గగ్గోలు


