రహదారి నిబంధనలు విధిగా పాటించాలి
పార్వతీపురం: రహదారి నిబంధనలు ప్రతి ఒక్కరూ విధిగా పాటించాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం ఆయన తన చాంబర్‌లో జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలను ప్రారంభించి వాల్‌పోస్టర్‌ను, కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రహదారి భద్రత ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ప్రస్తుతం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో 90శాతం రహదారి నిబంధనలు పాటించకపోవడం వల్లే జరుగుతున్నాయన్నారు. వాహన దారులు తమ ప్రాణాలతో పాటు తమపై ఆధారపడిన కుటుంబసభ్యులు, పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని రహదారి నిబంధనలను పాటించాలని హితవు పలికారు. కార్యక్రమంలో జిల్లా రవాణాధికారి దుర్గాప్రసాద్ రెడ్డి, ఆర్టీఏ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
నేటి నుంచి నాల్గవ విడత రీసర్వే
పార్వతీపురం: జిల్లాలో నాల్గవ విడత భూ రీసర్వే కార్యక్రమం శుక్రవారం ప్రారంభమవుతుందని కలెక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి గురువారం పేర్కొన్నారు. నాల్గవ విడత రీసర్వేను 120 గ్రామాల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ రీ సర్వేను ఆరు నెలల్లో పూర్తి చేసేలా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. భూ సమస్యల పరిష్కారం, భూములపై స్పష్టమైన హక్కులు, ఆధునిక మ్యాప్‌ల రూపకల్పన తదితర ప్రయోజనాలు రైతులకు కలుగుతాయన్నారు. రీ సర్వేకు అవసరమైన భూములకు సంబంధించి ధ్రువీకరణ పత్రాలు, పట్టాలు, ఇతర అవసరమైన పత్రాలు సిద్ధం చేసుకోవాలని రైతులకు సూచించారు. ఈ సర్వేలో రెవెన్యూ సిబ్బందికి రైతులు సహకరించాలని కోరారు.
విశాఖసిటీ: విశాఖ రేంజ్ డీఐజీగా విధులు నిర్వర్తిస్తున్న గోపీనాథ్ జెట్టి పదోన్నతి పొందారు. ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(ఐజీ)గా గురువారం ఆయన రేంజ్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కార్యాలయంలోని ఇతర పోలీస్ అధికారులతో కలిసి నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేంజ్ పరిధిలోని ఎస్పీలు తుహిన్ సిన్హా (అనకాపల్లి), అమిత్ బర్దర్ (అల్లూరి), కేవీ మహేశ్వర్‌రెడ్డి (శ్రీకాకుళం), ఎస్.వి.మాధవరెడ్డి (పార్వతీపురం), ఏఆర్.దామోదర్ (విజయనగరం) ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. పూల మొక్కలను అందించి పదోన్నతి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అధికారుల సమక్షంలో ఐజీ కేక్ కట్ చేశారు. నూతన సంవత్సరంలో రెట్టింపు ఉత్సాహంతో ప్రజలకు సేవ చేయాలని ఈ సందర్భంగా ఐజీ ఆకాంక్షించారు. రేంజ్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు, నేర నియంత్రణకు పెద్దపీట వేస్తామని స్పష్టం చేశారు. పోలీసు యంత్రాంగం ప్రజలకు ఎల్ల ప్పుడూ అందుబాటులో ఉంటుందని భరోసా ఇచ్చారు. రేంజ్ పరిధిలోని డీఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులు, కార్యాలయ మినిస్టీరియల్ సిబ్బంది, క్యాంపు కార్యాలయం సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు.
పురుగు మందు తాగి మహిళ ఆత్మహత్య
రామభద్రపురం: మండలంలోని కొట్టక్కి గ్రామంలో పక్కింటి వ్యక్తి తిట్టాడని మనస్తాపం చెందిన ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన తెంటు రమణమ్మ (32)కు చిల్లంగి ఉందని పక్కింటి వ్యక్తి మద్యం తాగి వచ్చి బూతులు తిట్టాడు. దీంతో తననే తిడుతున్నాడని మనస్తాపానికి గురైన ఆమె డిసెంబర్ 31న పురుగు తాగేసింది. ఈ విషయం గమనించిన కుటుంబసభ్యులు ప్రథమ చికిత్స నిమిత్తం సాలూరు సీహెచ్‌సీకి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది. మృతురాలి భర్త బాలరాజు ఫిర్యాదు మేరకు ఎస్సై వి. ప్రసాదరావు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రహదారి నిబంధనలు విధిగా పాటించాలి
రహదారి నిబంధనలు విధిగా పాటించాలి


