సాంకేతికతతో సేవలందించి లక్ష్యాలను సాధిద్దాం
పార్వతీపురం రూరల్: కొత్త ఆశలు..కోటి ఆశయాల కలయికతో నూతన వసంతంలోకి అడుగుపెట్టిన వేళ, వృత్తిధర్మంలో సాంకేతికతను జోడించి ప్రజలకు ‘రక్షణ కవచం’లా నిలవాలని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎస్పీ కేక్ కట్ చేసి, పోలీసు సిబ్బందికి, జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ, 2026లో పోలీస్ శాఖ నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ‘సాంకేతికతతో సేవలు–సమర్థవంతమైన పోలీసింగ్‘ అన్న సూత్రంతో ముందుకు సాగాలని, అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా శాంతియుత వాతావరణం కల్పించడమే తమ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. బాధ్యతాయుతమైన పౌరులుగా జిల్లా అభివృద్ధికి ప్రజలు కూడా సహకరించాలని ఆయన కోరారు. ఈ వేడుకల్లో అడిషనల్ ఎస్పీ ఎం.వెంకటేశ్వర రావు, ఏఎస్పీ మనీషా రెడ్డి, డీఎస్పీలు రాంబాబు, థామస్ రెడ్డి తదితర ఉన్నతాధికారులు ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కలు, పుష్పగుచ్ఛాలతో శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలోని సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన సంవత్సర సంకల్పాన్ని చాటారు.
ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి


