12న ప్రజా ఉద్యమ ర్యాలీ
● విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు రాజన్నదొర పిలుపు
సాలూరు: ప్రజావైద్యం ప్రజల హక్కని, దానిని హరించడం చంద్రబాబు ప్రభుత్వానికి తగదని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు పీడిక రాజన్నదొర అన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 12న సాలూరులో తలపెట్టిన ప్రజాఉద్యమ ర్యాలీని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులు, ప్రజలకు పిలుపునిచ్చారు. ర్యాలీకి సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ నాయకుడు చేయని విధంగా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకువచ్చారన్నారు. వీటిని ప్రైవేటీకరణ చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం పూనుకోవడం సిగ్గుచేటన్నారు. దీనికి నిరసనగా చేపట్టే ప్రజా ఉద్యమ ర్యాలీలో పార్టీలకతీతంగా ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, మేధావులు, నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొనాలని కోరారు. బుధవారం ఉదయం 10 గంటలకు పట్టణంలోని అఫీషియల్ కాలనీలో వద్ద ర్యాలీ ప్రారంభమవుతుందన్నారు.


