
మన ఆరోగ్యం మన చేతుల్లోనే
● చేతుల శుభ్రతతో రోగాలు దూరం
● నేడు ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం
ప్రతి ఒక్కరికీ అవసరమే
చేతుల శుభ్రత ప్రతి ఒక్కరికీ అవసరమే. ముఖ్యంగా భోజనం చేసే ముందు కచ్చితంగా చేతులు కడుక్కోవాలి. చిన్నపిల్లల తల్లిదండ్రులు గమనించి ఏదైనా తినే వస్తువులు ఇచ్చే ముందు చేతులను పరిశీలించి శుభ్రం చేసి ఇవ్వాలి. లేదంటే అనేక రోగాల బారిన పడాల్సి వస్తుంది. వాటర్ బోర్న్ డిసీజెస్ రాకుండా ఉండాలంటే చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. – విజయపార్వతి,
డిప్యూటీ డీఎంహెచ్‌వో, ఐటీడీఏ, సీతంపేట
సీతంపేట: ఆరోగ్యమంతా చేతుల పరిశుభ్రతతోనే ఉంటుంది. చేతులు శుభ్రంగా ఉంటే మూడొంతులు వ్యాధులు దరిచేరవు. ఈ నేపథ్యంలో 2008 నుంచి ఏటా అక్టోబర్ 15న ప్రపంచ చేతుల పరిశుభ్రత దినం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లాలోని అన్ని పాఠశాలల్లో స్వచ్ఛత పేరిట వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు.
చేతుల శుభ్రతతో సూక్ష్మజీవులు దూరం..
చేతుల ద్వారానే వ్యాధి కారక సూక్ష్మజీవులు శరీరంలోకి ప్రవేశిస్తాయి. అందుకే చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా జలుబు, శ్వాసకోస, జీర్ణసమస్యలు, జ్వరం, అతిసార వ్యాధులు చేతుల పరిశుభ్రత లేకపోవడం వల్లే వస్తాయని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా మల, మూత్ర విసర్జన తర్వాత ఆహారం తినే ముందు పిల్లలకు ఆహారం తినిపించే ముందు, అనారోగ్యంతో ఉన్న వారికి భోజనం పెట్టే ముందు, మందులను ఇచ్చే ముందు గాయాలైన చర్మాన్ని తాకినప్పుడు, దగ్గు, తుమ్ములు, ముక్కు చీదినప్పుడు, పెపుడు జంతువులు, పచ్చిమాంసాన్ని తాకినప్పుడు పిల్లలు మట్టిలో ఆడినప్పుడు తప్పనిసరిగా చేతులు శుభ్రం చేసుకోవాలి. గోళ్ల కిందిభాగంలో మట్టి చేరి క్రిములు పుట్టుకొస్తాయి. అందుకే గోళ్లను కత్తిరించుకోవాలి.
ఏమేం వాడాలి..
నీళ్లు, సబ్బు, శానిటైజర్లు వాడాలి. శానిటైజర్ల వాడకంతో బ్యాక్టీరియా, క్రిములను 60 శాతం వరకు తొలగించే అవకాశం ఉంది. ఒకటి రెండు శానిటైజర్ చుక్కలను చేతులపై వేసుకుని వేళ్లసందున మధ్యలో అంటుకునేలా చూడాలి. కొద్దిసేపు ఆరబెట్టుకోవాలి. రసాయనాలు లేని సబ్బులు వినియోగించడం మేలు, సున్నిపిండి, పుసుపు, నిమ్మకాయ రసం మిశ్రమంతో కలబంద, తేయాకు, పొద్దుతిరుగుడు నూనెలతో తయారైన శానిటైజర్లు ఎంతో మేలు కలిగిస్తాయి.
చేతులు ఇలా శుభ్రం చేసుకోవాలి
నీటిని చేతులతో తడపాలి
చేతులకు సబ్బు లేదా లిక్విడ్‌ను రుద్దకోవాలి
రెండు చేతుల మధ్య గట్టిగా రుద్దుతూ శుభ్ర పరుచుకోవాలి
చేతుల వెనుక బాగాలు, చేతి వేళ్ల మధ్యలో, గోళ్ల సందుల మధ్య ప్రతి వేలును శుభ్రం చేయాలి.
అరచేతులను వేళ్లతో రుద్దుతూ మణికట్టు భాగం నుంచి సబ్బుపోయేంత వరకు నీటిని పోస్తూ శుభ్రం చేయాలి.
20 సెకెన్లపాటు అయిదు పర్యాయాలు శుభ్రం చేసుకోవాలి. తరువాత మెత్తటి ఉతికిన వస్త్రంతో తుడుచుకోవాలి. లేదా చేతులను విదిలించాలి.
పిల్లలకు అలవాటుగా మారుస్తున్నాం
ప్రతిరోసూ చేతులు శుభ్రపరుచుకోవాలనేది విద్యార్థులకు వివరిస్తున్నాం. దీన్ని ఒక అలవాటుగా మార్చడానికి చర్యలు తీసుకుంటున్నాం. నిత్యం ఈ పద్ధతిని పాటిస్తే రోగాలు దరిచేరవు. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. – బి.ఉమావాణి,
హెచ్‌ఎం, హడ్డుబంగి ఆశ్రమపాఠశాల

మన ఆరోగ్యం మన చేతుల్లోనే

మన ఆరోగ్యం మన చేతుల్లోనే