నరక యాతన పడి వ్యాన్‌ డ్రైవర్‌ మృతి | - | Sakshi
Sakshi News home page

నరక యాతన పడి వ్యాన్‌ డ్రైవర్‌ మృతి

Oct 15 2025 6:30 AM | Updated on Oct 15 2025 6:30 AM

నరక య

నరక యాతన పడి వ్యాన్‌ డ్రైవర్‌ మృతి

మృతుడు తాడేపల్లి గూడెం వాసి

వీరఘట్టం: ఐషర్‌ వ్యాన్‌లో ఉన్న గోనె సంచులను అన్‌లోడ్‌ చేసేందుకు వ్యాన్‌కు ఉన్న తాళ్లను విప్పుతూ ప్రమాదవశాత్తు వ్యాన్‌ బాడీకి–క్యాబిన్‌కు మధ్యలో పడిపోయిన డ్రైవర్‌ రాజు (35) వీరఘట్టం మెయిన్‌ రోడ్డులో మంగళవారం మృతి చెందాడు. ఈ ప్రమాదంపై ఎస్సై జి.కళాధర్‌తో పాటు స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. స్థానిక గోనె సంచుల వ్యాపారికి విజయవాడ నుంచి ఐషర్‌ వ్యాన్‌తో తాడేపల్లి గూడెంకు చెందిన రాజు అనే డ్రైవర్‌ గోనె సంచులను తీసుకువచ్చాడు. వ్యాన్‌లో ఉన్న గోనె సంచులను అన్‌లోడ్‌ చేసేందుకు గాను కలాసీలు రావడంతో వ్యాన్‌కు ఉన్న కట్లు విప్పేందుకు డ్రైవర్‌ రాజు వ్యాన్‌ పైకి ఎక్కాడు.ఆ తాళ్లు విప్పుతూ ప్రమాదవశాత్తు వ్యాన్‌ బాడీకి–క్యాబిన్‌కు మధ్యలో ఉన్న సందులో పడిపోయాడు. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ రాజు తలకిందులుగా వ్యాన్‌ బాడీకి రేడియేటర్‌కు మధ్యలో ఉండిపోయి నరకయాతన అనుభవించాడు. ఈ ప్రమాదాన్ని చూసిన కలాసీలు, స్థానికులు వెంటనే అతన్ని బయటకు తీసే ప్రయత్నం చేశారు. పక్కనే ఉన్న కొందరు మోటార్‌ వర్కర్లు కూడా వచ్చి వ్యాన్‌కు ఉన్న కొన్ని పరికరాలను కోసేసి డ్రైవర్‌ రాజును బయటకు తీయగా కొన్ని గాయాలతో బయట పడ్డాడు. మెల్లగా బయటకు వచ్చి కూర్చున్న డ్రైవర్‌కు కొద్ది క్షణాల్లోనే ఫిట్స్‌ వచ్చి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్థానికులు సపర్యలు చేసి పీహెచ్‌సీకి తీసుకువెళ్లగా వైద్యసిబ్బంది తనిఖీ చేసి చనిపోయినట్లు నిర్ధారించారు. ఈ ప్రమాదంపై ఎస్సై జి.కళాధర్‌ కేసు నమోదు చేశారు. వీరఘట్టం పీహెచ్‌సీలో ఉన్న డ్రైవర్‌ మృతదేహాన్ని పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించి భద్రపరిచారు. మృతుడి కుటుంబసభ్యులకు సమాచారం తెలియజేశామని, వారు వచ్చిన తర్వాత స్టేట్‌మెంట్లు రికార్డు చేసి పోస్ట్‌మార్టం అనంతరం బాడీని అప్పగిస్తామని ఎస్సై తెలిపారు.

గిలగిలాకొట్టుకోవడంతో కంట తడి

చుట్టూ వందలాది జనం..రోడ్డు పక్కనే ఉన్న వ్యాన్‌ వద్ద గిలగిలా కొట్టుకుంటూ డ్రైవర్‌ రాజు చేసిన ఆర్తనాదాలు స్థానికులను కంటతడి పెట్టించాయి. వ్యాన్‌ బాడీకి–క్యాబిన్‌కు మధ్య సుమారు 40 నిమిషాల పాటు ఇరుక్కపోయిన డ్రైవర్‌ రాజు మృత్యువుతో పోరాడి బయటపడ్డాడని అందరూ అనుకున్నారు. హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకున్నారు.అయితే బయటకు వచ్చిన క్షణాల్లోనే డ్రైవర్‌ చనిపోయాడని తెలియడంతో అక్కడ ఉన్నవారంతా తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. వెంటనే ఈ ప్రమాద విషయాన్ని వ్యాన్‌ యజమానికి ఫోన్‌లో తెలియజేశారు. తాడేపల్లిగూడెంకు చెందిన రాజు అనే డ్రైవర్‌ విజయవాడ నుంచి ఈ వ్యాన్‌ ఇక్కడికి తీసుకువచ్చినట్లు వ్యాన్‌ యజమాని పోలీసులకు తెలిపారు.ఈ విషయాన్ని డ్రైవర్‌ కుటుంబసభ్యులకు పోలీసులు సమాచారం అందజేశారు.

నరక యాతన పడి వ్యాన్‌ డ్రైవర్‌ మృతి1
1/1

నరక యాతన పడి వ్యాన్‌ డ్రైవర్‌ మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement