
పాడి రైతులపై దాడి
గంట్యాడ: కూటమి సర్కార్ అరాచకాలకు అడ్డూఅదుపులేకుండా పోతోంది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఇలాకాలో కూటమి నేతలు మరింతగా రెచ్చి పోతున్నారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై నిన్న, మొన్నటి వరకు తమ ప్రతాపాన్ని చూపించిన కూటమి నేతలు తాజాగా పాడి రైతులపై కూడా అరాచకానికి తెరలేపారు. దీంతో కడుపు మండిన రైతులు తీవ్రస్థాయిలో పోలీసులు, రెవెన్యూ అధికారులను ప్రతిఘటించారు.
పశువుల శాలలు తొలగించే ప్రయత్నం
నీలావతి గ్రామంలో పాడి రైతులకు చెందిన పశువుల శాలలను తొలగించేందుకు గురువారం ప్రయత్నించారు. ఈ మేరకు ఉదయం 7 గంటలకే భారీగా పోలీసులు, రెవెన్యూ సిబ్బంది జేసీబీలతో సహా గ్రామానికి చేరుకున్నారు. గ్రామానికి చెందిన ఓ టీడీపీ నేత గ్రామంలో ఉన్న 25 మంది పశువుల శాలలను తొలగించాలని తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు దారు అధికార పార్టీ వ్యక్తి కావడంతో అధికారులు కూడా పశువులు శాలలు తొలగించేందుకు సిద్ధమయ్యారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా ఫిర్యాదు చేసిన వ్యక్తి చెప్పిన విధంగా చేయాలని అధికారులను ఆదేశించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పశువుల శాలలను రెవెన్యూ అధికారులు తొలగించేందుకు ప్రయత్నిస్తుండగా రైతులు వారిని అడ్డుకున్నారు. మరో వైపు జేసీబీతో శాలను తొలగించేందుకు దించుతుండగా మహిళలు, రైతులు జేసీబీని అడ్డుకున్నారు. పశువులకు, మాకు గోతులు తీసి అందులో పాతిపెట్టిన తర్వాత మీరు పశువుల శాలలను తొలగించుకోండి. మా లాంటి పేదవారి ఉసురు కచ్చితంగా మీకు తగులుతుందంటూ శాపనార్థాలు పెట్టారు.
తీవ్రప్రయత్నం చేసిన అధికారులు
పశువుల శాలలను ఏవిధంగా నైనా తొలగించేందుకు రెవెన్యూ, పోలీస్ అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఒకవైపు రెవెన్యూ సిబ్బంది పశువుల శాలలకు చెందిన చెక్కలు, కర్రలు, కమ్మలు తొలగించడంతో రైతులు అడ్డుకోగా మరోవైపు జేసీబీతో శాలలను తొలగించేప్రయత్నం చేశారు. ఉదయం7గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంట వరకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. వర్షాకాలం ఉన్న పళంగా వెళ్లిపోమంటే పశువులను ఎక్కడ కట్టాలి. వట్టి గడ్డిని ఎక్కడ వేయాలి. మాకు నెలరోజులు సమయం ఇవ్వండని రైతులు తహసీల్దార్ నీలకంఠేశ్వరరెడ్డిని కోరారు. నా చేతిలో ఏమి లేదు, నేను ఏమీ చేయలేనని ఆయన అనడంతో అయితే మాపీకలు కోసేసి మీరు శాలలు తీసుకోండని తీవ్ర స్థాయిలో ప్రతిఘటించారు. దీంతో రెవెన్యూ అధికారులు, పోలీసులు వెనుదిరిగారు.
నీలావతి గ్రామంలో పశువుల శాలల తొలగింపు యత్నం
తీవ్రంగా ప్రతిఘటించిన రైతులు
జేసీబీల అడ్డగింత
వెనుదిరిగిన పోలీస్, రెవెన్యూ అధికారులు