
మృతి చెందిన పోలీసు కుటుంబానికి ‘చేయూత‘
విజయనగరం క్రైమ్: జిల్లాలోని తెర్లాం పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేసి, ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన బి.నాగభూషణరావు కుటుంబానికి ‘చేయూత’ సహాయం ద్వారా రూ.1,48,600ల చెక్కును ఆయన భార్య ధనలక్ష్మికి ఎస్పీ ఏఆర్ దామోదర్ తన చాంబర్‌లో గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శాఖలో పని చేస్తూ ప్రమాదవశాత్తు లేదా అనారోగ్యంతో మరణించిన పోలీసు కుటుంబాలను ఆర్ధికంగా ఆదుకునేందుకు సిద్ధగా ఉన్నామన్నారు. ఇందుకోసం ప్రతి సిబ్బంది స్వచ్ఛదంగా ముందుకు వచ్చి వారి నెలవారి జీతంలోకొంత నగదు పోగు చేసి ఇస్తుండడం స్ఫూర్తిదాయకమని ఎస్పీ దామోదర్ అన్నారు. ఈ తరహా చర్యలు పోలీసు ఉద్యోగుల్లో ఐకమత్యం పెంచడంతో పాటు వారి కుటుంబాలకు అండగా ఉన్నామన్న భరోసా కల్పించడమేనన్నారు. కార్యక్రమంలో ఏఓ పి.శ్రీనివాసరావు, ఆఫీసు సూపరింటెండెంట్ టి.రామకృష్ణ, పోలీసు సంక్షేమ సంఘం అడహాక్ కమిటీ అధ్యక్షుడు కె.శ్రీనివాసరావు, పోలీసు కుటుంబ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
పిడుగుపాటుతో ఇద్దరికి అస్వస్థత
బొండపల్లి: మండలంలోని గొట్లాం గ్రామంలో గురువారం సాయంత్రం ఇంటిడాబాపై పని చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు పిడుగుపాటు బారిన పడి అస్వస్థతకు గురయ్యారు. గ్రామానికి చెందిన సింగవరపు సీతారాం, సీహెచ్.ఆదినారాయణలు ఇంటి డాబాపై పని చేస్తుండగా సాయంత్రం ఉరుములు, మొరుపులతో భారీ వర్షం కురవడంతో పిడుగుపాటుకు గురయ్యారు. దీంతో వారిద్దరినీ జిల్లా కేంద్రంలోని సర్వజన ఆస్పపత్రికి చికిత్స కోసం తరలించారు. ప్రసుత్తం ఇద్దరి పరిస్థితి బాగానే ఉన్నట్లు సమాచారం.
షిప్‌యార్డ్‌లో ఉద్యోగాలకు శిక్షణ
పార్వతీపురంటౌన్: విశాఖపట్నంలోని హిందూస్థాన్ షిప్‌యార్డ్ కంపెనీలో ఉద్యోగాల కోసం 3 నెలల నైపుణ్య శిక్షణ ఇస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కె.సాయికృష్ణ చైతన్య తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో విశాఖపట్నం స్కిల్ డెవలప్‌మెంట్ ఇనిస్టిట్యూట్‌లో ఐటీఐ అభ్యర్థులకు 3 నెలలు నైపుణ్య శిక్షణ ఇచ్చి షిప్ యార్డులో ఉద్యోగం కల్పిస్తున్నట్లు వివరించారు. కావున ఆసక్తి గల అభ్యర్థులు ఫోన్ 9676965949 నంబర్‌ను సంప్రదించాలని ఆయన ప్రకటనలో కోరారు.
నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి
నెల్లిమర్ల రూరల్: విద్యార్థులు, యువత నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలని ఎన్‌సీసీ గ్రూప్ కమాండింగ్ అధికారి సుమంత్ రాయ్ సూచించారు. మండలంలోని టెక్కలి సెంచూరియన్ విశ్వ విద్యాలయాన్ని ఆయన గురువారం సందర్శించి, విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. ఎన్‌సీసీ ద్వారా క్రమశిక్షణ అలవడుతుందని, అర్హులైన ప్రతిఒక్కరూ ఎన్‌సీసీలో చేరాలన్నారు. అనంతరం బీహార్‌కు బదిలీపై వెళ్తున్న ఎన్‌సీసీ కమాడింగ్ అధికారి కల్నల్ తపస్ మండల్‌ను ఘనంగా సత్కరించి, వీడ్కోలు పలికారు. అలాగే కొత్త కమాండింగ్ అధికారి సుమంత్‌రాయ్‌కు స్వాగతం పలికారు. కార్యక్రమంలో చాన్సలర్ ప్రొఫెసర్ జీఎస్‌ఎన్ రాజు, వైస్ చాన్సలర్ ప్రశాంత్‌కుమార్ మహంతి, రిజిస్ట్రార్ పల్లవి తదితరులు పాల్గొన్నారు.
గడ్డి మందు తాగి ఆటోడ్రైవర్ ఆత్మహత్య
వీరఘట్టం: మండలంలోని చిదిమి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ బౌరోతు సాయి(23) బుధవారం గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై ఎస్సై జి.కళాధర్ తెలిపిన వివరాల ప్రకారం ఆటోడ్రైవర్ ఆత్మహత్యకు గల కారణాలు ఇలా ఉన్నాయి. కాంచన అనే ఆమెతో ఏడాది క్రితం సాయికి వివాహం జరిగింది. బార్యభర్తల మధ్య మనస్పర్థల కారణంగా తరచూ గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై మృతుడి తల్లిదండ్రులు మోహనరావు, విజయల ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

మృతి చెందిన పోలీసు కుటుంబానికి ‘చేయూత‘

మృతి చెందిన పోలీసు కుటుంబానికి ‘చేయూత‘