
ముందుచూపు అవసరం
● కళ్లను పరిరక్షించుకోవాలి
● కంటిచూపు లేకపోతే జీవితం అంధకారమే
● నేడు ప్రపంచ దృష్టి దినోత్సవం
విజయనగరం ఫోర్ట్: మానవ శరీరంలో అతి ముఖ్యమైనవి కళ్లు, కంటి చూపు కోల్పోతే జీవితం అంధకారమే. ప్రకృతి అందాలను సైతం చూడలేని పరిస్థితి. అందువల్ల నేత్రాల సంరక్షణలో ప్రత్యేక శ్రద్ధ కనబరచాలి. గురువారం ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనం. ప్రస్తుతం వయస్సుతో సంబంధం లేకుండా అనేకమంది కంటి సమస్యలతో బాధపడుతున్నారు. పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు వివిధ రకాల కంటి సమస్యల బారిన పడుతున్నారు. మొబైల్ ఫోన్లు అధికంగా చూడడం వల్ల చాలా మందికి దృష్టి లోపం సమస్య వస్తోంది. ప్రపంచంలో ప్రతి ఒక సెకెనుకు ఒక వ్యక్తి దృష్టి కోల్పోతున్నాడు. వివిధ కారణాలతో ప్రతి ఒక నిమిషానికి ఒక చిన్నారి దృష్టి కోల్పోతున్నాడు. 2022వ సంవత్సరంలో నిర్వహించిన సర్వే అధారంగా భారత దేశంలో 49 లక్షల మంది అంధత్వంతో బాధపడుతున్నారు. అదేవిధంగా 3.50కోట్ల మంది దృష్టి లోపంతో బాధపడుతున్నారు. వారిలో 80 శాతం మంది సకాలంలో నేత్ర పరీక్షలు చేసుకోవడం ద్వారా దృష్టి లోపాన్ని నివారించగలిగారు. ఒక వ్యక్తి అంధత్వం బారిన పడడం వల్ల తలసరి స్థూల జాతీయ ఆదాయం రూ.1,70, 624 నష్టం వాటిల్లుతుందని అంచనా వేస్తున్నారు.
కంటి వెలుగు ద్వారా ఎంతో మందికి చూపు
కంటి ప్రాధాన్యతను గుర్తించిన గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమం ద్వారా ఎంతో మందిని అంధత్వం బారిన పడకుండా సకాలంలో కంటి పరీక్షలు నిర్వహించి వారికి చూపును ప్రసాదించింది. కంటి శస్త్రచికిత్సలు అవసరమైన వారికి చేయించింది. అదేవిధంగా కంటి అద్దాలు అవసరమైన వారికి కంటి అద్దాలు కూడా అందించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కంటి వెలుగు కార్యక్రమానికి మంగళం పాడేసింది.
2,92,462 మంది విద్యార్థులకు
తొలివిడతలో పరీక్షలు
డా.వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమం ద్వారా తొలివిడతలో 3357 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 2,92,462 మంది విద్యార్ధులకు విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. రెండోవిడతలో13,109 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 3844 మందికి కంటి అద్దాలు అవసరమని గుర్తించి కంటి అద్దాలు అందించారు. మెల్ల కన్ను శస్త్రచికిత్సలు 18 మందికి, కంటి శుక్లం శస్త్రచికిత్సలు ఐదుగురికి, రెప్పవాలడం శస్త్రచికిత్సలు 20 మందికి నిర్వహించారు. కంటివెలుగు మూడో విడతలో1, 79, 890 మందికి పరీక్షలు నిర్వహించారు. వారిలో 28, 213 మందికి కంటి శస్త్రచికిత్సలు అవసరం కాగా చేశారు. 43,938 మంది అవ్వాతాతలకు కళ్లజోళ్లు అందించారు.
కంటిసమస్యల పట్ల నిర్లక్ష్యం కూడదు
కంటి సమస్యల పట్ల నిర్లక్ష్యం చేయకూడదు. చాలా మంది కంటి సమస్యలకు పసర మందులు, నాటు వైద్యులను అశ్రయిస్తుంటారు. దీని వల్ల చూపు కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది. కంటి సమస్యలు వచ్చినప్పడు దగ్గరలో ఉన్న కంటి వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవాలి. అదేవిధంగా కంటి సమస్యలకు సొంత వైద్యం చేయకూడదు.