
నదిలో దూకిన వ్యక్తి మృతదేహం లభ్యం
వంగర: మండల పరిధి రుషింగి వంతెన పై నుంచి నాగావళి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన కళ్లేపల్లి జగదీష్ మృతదేహం బుధవారం లభ్యమైంది. ఈ నెల 7వ తేదీన గరుగుబిల్లి మండలం రావివలస వద్ద చేపల వ్యాపారం ముగించుకుని అదే మండలం మగ్గూరు గ్రామానికి వస్తుండగా మార్గమధ్యంలో భార్యాభర్తల మద్య తగాదా రావడంతో జగదీష్ వంతెనపై నుంచి దూకేసిన విషయం పాఠకులకు విదితమే. స్థానిక హెచ్‌సీ దూసి రాములు ఆధ్వర్యంలో పోలీసులు, గజ ఈతగాళ్లు రుషింగి, తలగాం, శివ్వాం తదితర ప్రాంతాల వద్ద నాగావళి నదీతీరంలో గాలింపు చేపట్టారు. చివరికి వీరఘట్టం మండలం మొట్ట–వంగర మండలం సంగాం గ్రామాల సమీపంలో నాగావళి నదిలో మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహాన్ని రాజాం సీహెచ్‌సీకి తరలిస్తున్నట్లు హెచ్‌సీ దూసి రాములు తెలిపారు.