
జేసీబీతో ఇసుక అక్రమ తవ్వకాలు
బొబ్బిలిరూరల్: ఇసుక తరలింపులో యథేచ్ఛగా అధికార పార్టీ నాయకులు చెలరేగిపోతున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ అర్ధరాత్రిపూట ఇసుక దందా కొనసాగిస్తున్నారు.విషయం తెలిసినా అధికార పార్టీ నాయకులు కావడంతో అధినేత ఆగ్రహానికి గురికాకూడదని అధికారులు సైతం మౌనముద్ర వహిస్తున్నారు. దీంతో ఏకంగా నదిలో జేసీబీని వినియోగించి పెద్ద ఎత్తున ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. బొబ్బిలి మండలంలోని అలజంగి గ్రామం వద్ద వేగావతి నదిలో మంగళవారం ఆర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారు జాము వరకు జేసీబీతో ఇసుకను తవ్వి ట్రాక్టర్లతో తరలించారు. దాదాపు 80 ఇసుక ట్రాక్టర్ల లోడ్ల ఇసుకను జేసీబీతో తవ్వి తీసి కొంతమేర పట్టణంలోని కాంట్రాక్టర్లకు అమ్ముకోగా మరికొన్ని ఇసుక లోడ్లు గ్రామంలోని కొత్తకాలనీలో రహదారిపై వేశారు. అడిగితే గ్రామంలోని రహదారులేకనని నమ్మించే ప్రయత్నం చేయగా గ్రామంలో కొంతమంది ప్రతిరోజూ అలజంగిలో జరుగుతున్న ఇసుక దందాపై ఇతరులకో నీతి,అధికార పార్టీనాయకులకో నీతి అంటూ చర్చించుకుంటున్నారు.
పరిశ్రమలకు రాత్రిపూట తరలింపు
ఇదిలా ఉండగా గ్రోత్‌సెంటర్‌లో ఫెర్రోపరిశ్రమలకు సైతం రాత్రి వేళల్లో ఇసుక అక్ర తరలింపు జరుగుతోంది. స్టాక్ పాయింట్ నుంచి తీసుకోవాల్సిన ఇసుకను ట్రాక్టర్ల యజమానులను సంప్రదించి పెంట వద్ద వేగావతి నది నుంచి రాత్రి 11 గంటలనుంచి తెల్లావార్లూ ఇసుక అక్రమరవాణా జరుగుతోందని, రోడ్లు కొట్టుకు పోతున్నాయని సాక్షాత్తు ఆయా గ్రామాల ప్రజలు తహసీల్దార్ ముందు వాపోయారు. అయినా అధినేత అంక్షలతో చూసీచూడనట్లు అధికారులు వ్యవహరిస్తున్నారు.
నా దృష్టికి రాలేదు
అలజంగి గ్రామంలోని వేగావతి నదిలో మంగళవారం రాత్రి ఇసుక తవ్వకాలపై తహసీల్దార్ ఎం.శ్రీను వద్ద ప్రస్తావించగా తమ దృష్టికి రాలేదన్నారు. పరిశీలించి చర్యలు చేపడతామని చెప్పుకొచ్చారు.