
ఇతర సమస్యలతో మరణాలు
పార్వతీపురంటౌన్: జిల్లాలో నిమ్మక సుమన్, నిమ్మక ప్రశాంత్‌లు పచ్చకామెర్ల వల్ల కాదని ఇతర సమస్యలతో మృతి చెందారని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. ఎస్.భాస్కరరావు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన తన చాంబర్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నెల్లూరు జిల్లా నివాసి నిమ్మక సుమన్ (23) సెప్టెంబర్ 14వ తేదీన గుమ్మలక్ష్మీపురల మండలం బాలేసు గ్రామానికి వచ్చాడన్నారు. కుటుంబసభ్యుల సమాచారం మేరకు ఆయన గత నెల రోజులుగా నెల్లూరులో స్టోర్ కీపర్ గా పని చేస్తున్నాడని, సెప్టెంబర్ 30న ఒడిశా రాష్ట్రం లోని దుర్గపాడు జలపాతాన్ని సందర్శించి, అదే రోజు సాయంత్రం తిరిగి వచ్చాడన్నారు. అక్టోబర్ 4న జ్వరం, రెండు సార్లు విరేచనాలు, వాంతులు, పొత్తికడుపు నొప్పితో బాధపడుతూ ఉదయం 11 గంటలకు కురుపాం కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు రాగా వైద్యుడు పరిశీలించి అక్టోబర్ 5న మధ్యాహ్నం 12 గంటల సమయంలో పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి రిఫర్ చేయడంతో చికిత్స అందించినట్లు పేర్కొన్నారు. జిల్లా ఆస్పత్రిలో చేర్చిన సమయానికి రోగి స్థిరంగా,చురుగ్గా ఉన్నాడని, దురదృష్టవశాత్తు అక్టోబర్ 6న అర్ధరాత్రి పార్వతీపురం జిల్లా ఆస్పత్రిలో ఎన్సెఫలోపతి కారణంగా మరణించాడని చెప్పారు. అదేవిధంగా నిమ్మక ప్రశాంత్ (31) జియ్యమ్మవలస మండలం చినడోడిజ గ్రామంలో అక్టోబర్ 5న తీవ్రమైన కడుపునొప్పితో సామాజిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి పరీక్షలు చేయించుకున్న అనంతరం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారన్నారు. అయితే అప్పటికే దీర్ఘకాలంగా మద్యపానం అలవాటు వల్ల మల్టిపుల్ ఆర్గానన్స్ పెయిల్యూర్ కావడంతో మయోకార్డియల్ ఇన్ఫెక్షన్‌తో అక్టోబర్ 5 తేదీన రాత్రి మృతి చెందినట్లు వివరించారు. ఈ మరణాలు ఇతర సమస్యల కారణంగా జరిగినవే తప్ప , పచ్చకామెర్ల వల్ల కాదని స్పష్టం చేశారు.
డీఎంహెచ్‌ఓ డా. ఎస్.భాస్కరరావు