
చెట్టు మీద పడి పోడు రైతు మృతి
పార్వతీపురం రూరల్/కొమరాడ: కొమరాడ మండలంలో బుధవారం వ్యవసాయ పనులకు వెళ్తున్న ఓ రైతు మీద మామిడి చెట్టు పడడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని గూడాతలేసు పంచాయతీ పరిధి తీలేసు గ్రామానికి చెందిన పువ్వుల రామారావు(47) కొండపోడు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నాడు. రోజులాగానే బుధవారం ఉదయం వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి బయల్దేరాడు. మార్గమధ్యంలో ఒక్కసారిగా పెనుగాలి వీయడంతో ఓ భారీ మామిడి చెట్టు రామారావుపై పడింది. దీంతో అక్కడికక్కడే కుప్పకూలిపోగా గమనించిన స్థానికులు హుటాహుటిన 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, రామారావు మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పార్వతీపురం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తెకు వివాహం కాగా, డిగ్రీ పూర్తి చేసిన చిన్న కుమార్తె తల్లిదండ్రుల వద్దనే ఉంటోంది. రామారావు ఆకస్మిక మరణంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.