
పక్షం దాటాక.. పరామర్శలా..!
సాలూరు: జిల్లాలో కురుపాం బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినులు అనారోగ్యంతో మృతి చెందడం బాధాకరమని వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యులు, మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర పేర్కొన్నారు. పట్టణంలోని తన గృహంలో విలేకరులతో బుధవారం ఆయన మాట్లాడారు. గిరిజన విద్యార్థినులు అనారోగ్యంతో మరణిస్తుంటే సంబంధిత మంత్రి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ సంధ్యారాణిపై నిప్పులు చెరిగారు. విద్యార్థినులు మరణించిన పక్షం రోజుల తరువాత తీరుబడి చూసుకుని మంత్రి సంధ్యారాణి విశాఖపట్నం కేజీహెచ్‌కు, కురుపాం బాలికల గురుకుల పాఠశాలకు వెళ్లడం చూస్తుంటే గిరిజనుల పట్ల మంత్రికి, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఏపాటిదో అర్ధమవుతుందని మండిపడ్డారు. విద్యార్థిని చనిపోయిందని తెలిసే సమయానికి మంత్రి స్థానికంగా సాలూరులోనే ఉన్నారని అయినా ఆమె పరామర్శకు వెళ్లలేదని పేర్కొన్నారు. సీఎం స్పందించారని తెలుసుకుని తీరుబడిగా కేజీహెచ్‌కు, తరువాత ఇన్‌చార్జి మంత్రిని తీసుకుని కురుపాం పాఠశాలకు వెళ్లారని చెప్పారు. విద్యార్థినుల మరణాలతో రాజకీయం చేస్తున్నారంటూ మంత్రి సంధ్యారాణి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. గత ప్రభుత్వంలో ఎక్కడైనా మరణాలు సంభవిస్తే ఇవి ప్రభుత్వ హత్యలని, ప్రభుత్వ చేతగానితనమే కారణమని నాడు సంధ్యారాణి గగ్గోలు పెట్టేవారని, నేడు ఈ మరణాలపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థులకు సంబంధించి పాడేరు ఐటీడీఏ పీవో డబ్బులివ్వకపోవడంతో కేజీహెచ్ ట్రైబల్‌సెల్ వారు ఆ విద్యార్థులను కేజీహెచ్ నుంచి తీసుకువెళ్లిపోతున్న సంఘటనలు దురదృష్టకరమన్నారు. ఏఎన్‌ఎంల నియామకంపై మంత్రిగా సంధ్యారాణి తొలి సంతకం చేసి ఏడాదిన్నరైనా నేటికీ ఆ హామీ అమలు కాలేదని ఎద్దేవా చేశారు. సాలూరు మండలం కేజీబీవీ పాఠశాలలో విద్యార్థుల భోజన విషయంలో వార్డెన్, పీవీటీ గిరిజనురాలైన స్పెషలాఫీసరును మంత్రి దగ్గరుండి తొలగించారని, మరి మంత్రి సొంత జిల్లాలో 11 మంది మరణించారని, అల్లూరి సీతారామరాజు జిల్లాలోనూ గిరిజన విద్యార్థులు మరణించారని వీటికి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఎందుకు బాధ్యత వహించరని ప్రశ్నించారు. మంత్రి సంధ్యారాణిని ఎందుకు తప్పించకూడదని నిలదీశారు. బాధిత విద్యార్థినుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.25లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారం శాశ్వతం కాదని పాలకులు గుర్తించాలని సూచించారు.
జగన్‌మోహన్‌రెడ్డిపై విమర్శలా?
విద్యార్థినుల మరణాలపై దిగ్భ్రాంతి చెందిన మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి చలించి మానవత్వంతో స్పందించి ఒక్కో విద్యార్థిని కుటుంబానికి రూ.2లక్షలు సాయం ప్రకటించి ఇచ్చారని ఇది ఆయన మానవత్వానికి, మంచితనానికి నిదర్శనమన్నారు. అటువంటి వ్యక్తిపై, తనపై మంత్రి సంధ్యారాణి అభ్యంతరకర పదజాలాలతో విమర్శలు చేస్తున్నారని గుర్తు చేశారు.
గిరిజన విద్యార్థినుల మృతికి మంత్రి సంధ్యారాణి బాధ్యత వహించాలి
బాధిత కుటుంబాలకు మానవత్వంతో స్పందించి రూ.2 లక్షలిచ్చిన మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని
విమర్శించడమా?
మాజీ ఉప ముఖ్యమంత్రి
పీడిక రాజన్నదొర