
కలుషిత జలం.. వ్యాధులకు గాలం!
సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లాలోనే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా కురుపాం గిరిజన విద్యార్థుల మరణాల ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ప్రధానంగా కలు షిత నీటి వల్లే పచ్చకామెర్లు సంభవించాయన్న ఒక వాదన ఉంది. మరోవైపు జిల్లా కేంద్రంలోనే తీవ్ర తాగునీటి కష్టాలు పుర వాసులకు ఎదురవుతున్నాయి. రోజుల తరబడి ఇవ్వకపోవడం.. కుళాయిల ద్వారా అప్పుడప్పుడు వదిలినా.. బురదనీరే రావడం పరిపాటిగా మారింది.
ఎండగట్టేయడం..
లేదంటే బురద నీరు అంటగట్టేయడం
దాదాపు రెండు వారాలుగా మున్సిపల్ కుళాయిల ద్వారా తాగునీరు సరఫరా కావడం లేదు. దీంతో ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపాలిటీలో ఉన్న 30 మురికివాడల ప్రజలతో పాటు పార్వతీపురంలో దాదాపు 80 శాతం మందికి మున్సిపల్ కుళాయిలే ఆధారం. రెండు వారాలుగా నీటి సరఫరా కాకపోవడంతో వారంతా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. బయట ప్లాంట్లలో కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి. బుధవారం నీటి సరఫరా అయినా.. ఎర్ర నీరే దర్శనమిచ్చింది. బకెట్లు, బిందెలతో పట్టుకున్నా.. అడుగంతా బురదే ఉంటోందని మహిళలు వాపోతున్నారు. తాగేందుకే కాదు.. వినియోగానికీ పనికిరావని చెబుతున్నారు. ఈ నీటిని తాగితే దగ్గు, జలుబు, గొంతు నొప్పి, టైఫాయిడ్, పచ్చకామెర్లు వంటి రోగాలు వస్తున్నాయని వాపోతున్నారు.
వేసవొచ్చినా.. వానొచ్చినా ఇదే గతి
వేసవి, వర్షాకాలం వచ్చిందంటే.. మున్సిపల్ వాసులకు ఈ బురదనీరే గతి అవుతోంది. నాగావళి నది నుంచి పట్టణానికి నీరు సరఫరా అవుతుంది. వేసవిలో భూగర్భ జలాలు అడుగంటిపోవడం.. వర్షాకాలంలో వరద నీరు కారణంగా బురద నీరు తప్పడం లేదు. పార్వతీపురం పట్టణంలో 30 వార్డులున్నాయి. 65 వేల మంది జనాభాకు 8,700 కుళాయిల ద్వారా.. అయిదు రిజర్వాయర్ల నుంచి నీటి సరఫరా అవుతోంది. తోటపల్లి వద్దనున్న నాగావళి నదిలో ఇన్‌ఫిల్ట్రేషన్ బావులున్నాయి. అక్కడ నుంచి మోటార్ల ద్వారా నీరు బూస్టర్ పంప్ హౌస్‌కు చేరి, అక్కడ శుద్ధి చేశాక, రిజర్వాయర్లకు పంపిస్తుంటారు. ప్రస్తుతం శుద్ధి ప్రక్రియ ఎక్కడా జరగడం లేదు. మున్సిపల్ అధికారులు రాజకీయాల మీద వహించే శ్రద్ధ.. ప్రజలకు తాగునీరు, ఇతర సౌకర్యాలను కల్పించడంలో చూపడం లేదని పట్టణ వాసులు విమర్శిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కౌన్సిలర్లు గగ్గోలు పెడుతున్నారు. దీనిపై కమిషనర్ వద్ద మొర పెట్టుకున్నా.. ఆయన నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని వాపోతున్నారు. ‘వరదొస్తే నేనేం చేస్తా.. నేను ఎక్కడి నుంచి తేగలను. మంచినీరు వస్తే ఇవ్వగలను..’ అంటూ బాధ్యాతారాహిత్యంగా సమాధానమిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి నీరు తాగితే పచ్చ
కామెర్లే కాదు.. ఏ వ్యాదైనా రావచ్చు!
జిల్లా కేంద్రంలో 10 రోజులుగా తాగునీటి సరఫరా బంద్
వదిలినా.. బురద నీరే గతి