
జీవో 13ను తక్షణమే రద్దు చేయాలి
సాలూరు: కార్పొరేటర్లకు అడవులను అప్పగించే జీవో నంబరు 13ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని పలువురు నాయకులు, హైడ్రో పవర్ ప్రాజెక్టు వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. పాచిపెంట మండలంలో గుమ్మకోట జంక్షన్ నుంచి శతాబి వరకు హైడ్రో పవర్ ప్రాజెక్టు వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో బుధవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో గిరిజనులు విల్లంబులతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేంద్ర, రాష్ట్ర నాయకులు బాలదేవ్, సీపీఎం మన్యం జిల్లా కార్యదర్శి గంగునాయుడు మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో ఉన్న అపారమైన ఖనిజ సంపదను అదాని, అంబానీ, నవయుగ వంటి కార్పొరేటర్లకు దోచిపెట్టడమే పనిగా పెట్టుకుని ప్రభుత్వాలు పని చేస్తున్నాయని విమర్శించారు. అందులో భాగంగానే అనంతగిరి, పాచిపెంట మండలాలను ముంపునకు గురి చేస్తూ గిరిజనులకు తీవ్ర ద్రోహం చేసేందుకు జీవో 13 విడుదల చేసిందన్నారు. దీని ద్వారా నవయుగ సంస్థకు ఈ ప్రాంత ప్రజలను బలి చేసేందుకు ప్రభుత్వాలు చూస్తున్నాయన్నారు. దీనిపై గిరిజనులంతా సమష్టి పోరాటానికి సిద్ధంగా ఉండాలన్నారు. పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.