
మరణంలోనూ వీడని బంధం!
పెంచిన మమకారం...తండ్రితో ఉన్న అనుబంధం ఆ కొడుకును నిలవనీయలేదు.. జన్మ కారకుడైన తండ్రి ఇక లేడనే విషాదం ఆ కొడుకు గుండె తట్టుకోలేకపోయింది. తండ్రి మృతిని తలుచుకుంటూ శ్మశాన వాటిక నుంచి ఇంటికి వస్తూనే కుమిలిపోసాగాడు. ఆ బాధను ఆ గుండె తట్టుకోలేకపోయింది. అటు తండ్రి చితి ఆరక ముందే తనువు చాలించాడు. ఈ విషాద ఘటన వివరాల్లోకి వెళ్తే...
రాజాం సిటీ: తండ్రి చితి ఆరక ముందే కుమారుడు మృతి చెందిన హృదయ విదారక ఘటన మండల పరిధి బొద్దాం గ్రామంలో చోటు చేసుకుంది. తండ్రీకొడుకు 24 గంటల వ్యవధిలో మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. ఈ ఘటన అందరినీ కలచివేసింది. మండల పరిధి బొద్దాం గ్రామానికి చెందిన కొన్న బాలకృష్ణ (65) ఈ నెల 6వ తేదీన వేకువజామున గుండెపోటుకు గురై మృతి చెందాడు. ఈయన డోలక్ వాయిద్యంలో ప్రసిద్ధిగాంచిన కళాకారుడుగా గుర్తింపు పొందాడు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. పౌరాణిక, సాంఘిక నాటకాలకు డోలక్ వాయిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నాడు. ఈయనకు ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు కనకరాజు తెలంగాణాలో పోలీసుగా విధులు నిర్వహిస్తున్నాడు. రెండో కుమారుడు అప్పలరాజు ఇంటి వద్దే ఉంటూ పెయింటింగ్ పనులు చేసుకుంటున్నాడు. చిన్న కుమారుడు సాయికృష్ణ ఉపాధ్యాయునిగా స్థిరపడ్డాడు.
తండ్రి చితి ఆరక ముందే..
కొన్న బాలకృష్ణ మృతి చెందిన 24గంటలు గడవక ముందే తన రెండో కుమారుడు అప్పలరాజు (32) మృతి చెందాడు. తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ దహన సంస్కారాల అనంతరం ఇంటికి చేరిన కాసేపటికే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కుటుంబీకులు, సహచరులు హుటాహుటిన రాజాం ఆస్పత్రికి తరలించగా అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 6న అర్థరాత్రి దాటిన తరువాత మృతి చెందినట్టు గ్రామస్తులు తెలిపారు. ఈయనకు ఏడాది క్రితమే వివాహం జరిగింది. 24 గంటల వ్యవధిలో తండ్రీకొడుకు మృతి చెందడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ విషాద ఘటన గ్రామస్తులను కంటతడి పెట్టించింది.
తండ్రి చితి ఆరక ముందే
కొడుకు మృతి
తండ్రి మృతిని తట్టుకోలేక
24 గంటలు గడవక ముందే
తనువు చాలించిన కుమారుడు
బొద్దాంలో హృదయ విదారక ఘటన

మరణంలోనూ వీడని బంధం!