
గిరిజన సంఘాలను ఎందుకు అడ్డుకున్నారు?
హడావిడి పరామర్శలు...
ఇన్నాళ్లూ తీరిక లేని మంత్రులు, ఎమ్మెల్యేలు
పాలనా వైఫల్యాన్ని అంగీకరించాల్సిందిపోయి.. మాజీ ముఖ్యమంత్రిపై విమర్శలు
జగన్ ప్రశ్నించకపోతే.. పరామర్శలకు వచ్చేవారా?
పిల్లలు ఇళ్ల వద్దే చనిపోయారు..
పరిహారం ఇంకెలా ఇస్తామన్న గిరిజన సంక్షేమశాఖ మంత్రి
సాక్షి, పార్వతీపురం మన్యం/పార్వతీపురం రూరల్ : ఒకరేమో జిల్లాకు చెందిన మంత్రి.. స్వయంగా గిరిజన సంక్షేమం, మాతాశిశు సంక్షేమ శాఖలు చూస్తున్నారు. మరొకరేమో.. పక్క జిల్లా శ్రీకాకుళా నికి చెందిన మంత్రి, పార్వతీపురం మన్యం ఇన్‌చార్జి మంత్రి కూడానూ... దసరా సెలవులకని ఇళ్లకు వెళ్లిన కురుపాం గిరిజన సంక్షేమ గురుకుల విద్యార్థులకు ఆరోగ్యం బాలోదు. ఈలోగానే ఇద్దరు బాలికలు మరణించారు. మరో వందమందికిపైగా జిల్లా ఆస్పత్రి, విశాఖ కేజీహెచ్‌ల్లో చికిత్స పొందుతున్నారు. ఇద్దరు మంత్రులకూ.. వారిని పరామర్శించే తీరిక దొరకలేదు.
మరోవైపు తమ నియోజకవర్గానికి చెందిన పిల్లలు ఈ పరిస్థితిలో ఉంటే, కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి జిల్లా ఆస్పత్రివైపు కన్నెత్తి చూడలేదు. తన పరిధిలోనే ఉన్న జిల్లా ఆస్పత్రిలో పదుల సంఖ్యలో విద్యార్థు లు అస్వస్థతతో చికిత్స పొందుతున్నా.. స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయ్‌చంద్ర పట్టించుకోలేదు. బాధ్యత గల నేతగా.. జరిగిన ఘటనను, పాలనా వైఫల్యాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నిస్తే గానీ ఏ ఒక్కరూ మేల్కొనలేదు. హడావిడిగా ఆదివారం సాయంత్రం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి విశాఖ కేజీహెచ్‌కు వెళ్లి విద్యార్థులను పరామర్శించారు.
స్వయానా వారి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీస్తే గానీ... పార్వతీపురం జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికలను చూసేందుకు రాలేదు. అంతెందుకు.. మూడు రోజుల కిందట ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమానికి జిల్లా ఇన్‌చార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పార్వతీపురం విచ్చేశారు. ప్రభుత్వ కళాశాల మైదానంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడికి కూతవేటు దూరంలో ఉన్న జిల్లా ఆస్పత్రికి వెళ్లాలన్న ఆలోచన రాలేదు. స్థానిక ఎమ్మె ల్యేలకూ తీరిక లేదు? ఇదీ.. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి అచ్చెన్నాయుడు, కూటమి ఎమ్మెల్యేలకు గిరిజనులపై ఉన్న శ్రద్ధ!
జిల్లా ఇన్‌చార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తొలుత సోమవారం మధ్యాహ్నం కురుపాంలోని గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. వైద్య, గిరిజన సంక్షేమ శాఖ, ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షించారు. విద్యార్థుల అస్వస్థతకు గల కారణాలపై ఆరా తీశారు. సమగ్ర నివేదిక ఇవ్వాలని గిరిజన సంక్షేమ శాఖ అధికారు లను ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యవేక్షణ చేస్తున్నారని.. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. బాలికలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, మోడల్ గురుకుల పాఠశాలగా తీర్చిదిద్దుతామని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై.. బాలికలకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. మరోవైపు విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాలికల తల్లిదండ్రులు.. ఇక్కడ తమను ఎవరూ పట్టించుకోవడం లేదని, ఏం వైద్యం అందిస్తున్నారో కూడా చెప్పడం లేదని వాపోతున్నారు. కనీసం గిరిజన సంక్షేమ శాఖ నుంచి ఒక అధికారిని కూడా పర్యవేక్షణకు ఉంచలేదని మంత్రి వ్యాఖ్యలకు విరుద్ధంగా చెబుతుండడం గమనార్హం.
విద్యార్థులకు, వారి కుటుంబాలకు న్యాయం చేయా లని కలెక్టరేట్ వద్ద గిరిజన సంఘాల నాయకులు.. బాధిత తల్లిదండ్రులతో కలిసి ధర్నా చేశారు. అనంతరం ఆస్పత్రివద్దకు చేరుకున్నారు. మంత్రులను కలసి సమస్య చెప్పుకొందామని భావించారు. పోలీసుల సాయంతో కూటమి ప్రభుత్వ పెద్దలు వారి గొంతు నొక్కేశారు. వారెవరూ ఇక్కడ ఉండటానికి వీల్లేదని.. ఇక్కడ నుంచి పంపించేయాలని ఓ ఎమ్మెల్యే పోలీసులకు చెప్పారు. వెంటనే వారు గిరిజన సంఘాల నాయకులను ఈడ్చుకుంటూ అక్కడ నుంచి బయటకు పంపించేశారు.
అనంతరం మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. మీడియాతో మాట్లాడారు. ప్రసుత్తం 140 మంది విద్యార్థులు జిల్లా ఆస్పత్రి, విశాఖ కేజీహెచ్‌ల్లో చికిత్స పొందుతున్నట్లు మంత్రి సంధ్యారాణి తెలిపారు. 37 మంది కోలుకుని డిశ్చార్జికి సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. పిల్లలు ఇళ్ల వద్దే చనిపోతే ప్రభుత్వానిది ఎలా బాధ్యత అవుతుందని ప్రశ్నించారు. మానవతా దృక్పథంతో స్పందించామని, ఆస్పత్రిలో చేర్చి, మెరుగైన చికిత్స అందిస్తున్నామని చెప్పారు. ఇద్దరు పిల్లలూ ఇళ్ల వద్దే చనిపోవడం వల్ల పరిహారం ఎలా ఇవ్వగలమని.. ఇన్‌చార్జి మంత్రి, ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణ యం తీసుకుంటామని తేల్చిచెప్పారు.
ఈ ఘటనపై నా రాజకీయాలు చేస్తున్నారని విమర్శలు కురిపించారు. తనదైన శైలిలో మాజీ ముఖ్యమంత్రి జగన్ పైనా, వైఎస్సార్‌సీపీ నేతలపైన ఆరోపణలు గుప్పించారు. జిల్లాలో 11 మంది చనిపోయినట్లు అవాస్తవాలు మాట్లాడుతున్నారని తప్పును కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నం చేశారు. వాస్తవానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వా త.. ఇప్పటి వరకు 13 మంది గిరిజన విద్యార్థులు మృతి చెందారు. అందులో గిరిజన ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు 9 మంది, గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల కురుపాం విద్యార్థులు ఇద్దరు.. కొమరాడ, సాలూరు కేజీబీవీల్లో చదువుతున్న ఒక్కొక్క గిరిజన విద్యార్థి మరణించారు. ఇదే విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రస్తావించారు.
ఇళ్ల వద్దే చనిపోయారు.. ప్రభుత్వానికి ఏం సంబంధం?
మంత్రి సంధ్యారాణి.. దీనిని వక్రీకరిస్తూ, ఇద్దరే చనిపోయారని, అది కూడా ఇళ్ల వద్దే అనారోగ్యం పాలయ్యారని, ప్రభుత్వానికి ఏం సంబంధమని సర్దిచెప్పుకోవడం గమనార్హం. ఇద్దరు పిల్లలూ ఇళ్ల వద్దే అనారోగ్యం పాలైతే.. ఒకే పాఠశాలకు చెందిన వంద మందికిపైగా విద్యార్థులు ఎందుకు పచ్చకామెర్ల బారిన పడ్డట్లు? మంత్రి చెప్పుకొన్నట్లుగా అది ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తే.. అది పాఠశాలలోనే జరిగినట్లు కాదా? 611 మంది విద్యార్థులకు అపరిశుభ్రంగా ఉన్న 30 మరుగుదొడ్లు ఎలా సరిపోతాయి? అంతమంది గిరిజన విద్యార్థులు ఒకేసారి అస్వస్థతకు గురైతే, వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంటే.. తమకు సంబంధం లేదని ప్రభుత్వం అనుకోవ చ్చా? సొంత జిల్లాలో గిరిజన విద్యార్థులు ప్రాణాపాయ స్థితిలో ఉంటే.. బాధ్యత గల ప్రజాప్రతినిధులుగా వారిని పరామర్శించాల్సిన అవసరం లేదా? అన్న ప్రశ్నలు గిరిజన సంఘాల నుంచి వ్యక్తమవుతున్నాయి.