
అయ్యో పసికూన.. ఎక్కడున్నావమ్మా..!
● మృతి చెందిన పిల్లఏనుగు కోసం తల్లడిల్లుతున్న ఏనుగుల గుంపు ● రోజంతా మృతిచెందిన చెరువు వద్దే సంచారం
పార్వతీపురం రూరల్: గుంపులో జాగ్రత్తగా చూసుకుంటున్న పిల్లఏనుగు మృతితో ఏనుగుల గుంపు తల్లడిల్లుతోంది. గున్న మృతి చెందిన లక్ష్మీనారాయణపురం సమీపంలోని ముది రాజు చెరువు వద్దనే సోమవారం వెతుకులాడాయి. చెరువులో దిగిన పిల్ల ఏనుగు తిరిగి ఒడ్డుకు చేరకపోవడంతో చెరువు వైపే చూస్తున్నాయి. ఈ దృశ్యాలు స్థానికులను కంటతడి పెట్టించాయి.
పార్వతీపురం మండలంలోని పెదమరికి, చినమరికి, కృష్ణపల్లి, లక్ష్మీనారాయణపురం తదితర గ్రామాల్లో కొద్ది రోజులుగా సంచరిస్తున్న ఏనుగుల గుంపు ఆదివారం ముదిరాజు చెరువులో దిగాయి. వీటిలో ఏడు నెలల వయస్సు ఉన్న (జూనియర్ హరి) కూడా ఉంది. కొంత సమయం చెరువులో ఉన్న ఏనుగులు తిరిగి ఒడ్డుకు చేరుకుని పొలాల్లోకి వెళ్లిపోయాయి. గుంపులో జూనియర్ హరి కనిపించకపోవడాన్ని గమనించి తిరిగి చెరువు వద్దకు చేరుకున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు చెరువుతో పాటు పరిసర ప్రాంతాల్లో గాలించాయి.
ఏనుగులతో జాగ్రత్త..
ప్రస్తుతం ఏనుగుల గుంపు ఆందోళన కరంగా ఉండే అవకాశం ఉంది. వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు జాగ్రత్తలు పాటించాలని అటవీశాఖ సిబ్బంది, అధికారులు స్థానికులను హెచ్చరిస్తున్నారు.