కోరుకొండ సైనిక్‌ స్కూల్‌ విద్యార్థుల ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

కోరుకొండ సైనిక్‌ స్కూల్‌ విద్యార్థుల ప్రతిభ

Oct 7 2025 3:55 AM | Updated on Oct 7 2025 3:30 PM

విజయనగరం రూరల్‌: యూపీఎస్సీ పరీక్షల్లో కోరుకొండ సైనిక్‌ స్కూల్‌ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ, ఇండియన్‌ నావల్‌ అకాడమీ రాత పరీక్షల్లో మొత్తం 54 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వారిని ప్రిన్సిపాల్‌ ఎస్‌ఎస్‌ శాస్త్రి అభినందించారు. భారత సాయుధ దళాలకు భవిష్యత్‌ నాయకులను అందించడంలో కోరుకొండ సైనిక్‌ స్కూల్‌ నిబద్దతకు ఇది నిలువెత్తు నిదర్శనమని ప్రిన్సిపాల్‌ సంతోషం వ్యక్తం చేశారు.

వ్యక్తి అనుమానాస్పద మృతి

పీఎం పాలెం: ఓ వ్యక్తి అనుమానాస్పద మృతిపై పీఎం పాలెం పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. స్థానిక సీఐ బాలకృష్ణ తెలిపిన వివరాలివి.. పార్వతీపురం మన్యం జిల్లా బాలగూడబ గ్రామానికి చెందిన మువ్వల శివప్రసాద్‌ (54) భార్య పద్మజతో పీఎం పాలెం రామాలయం సమీపంలోని ఎల్‌ఐజీ క్వార్టర్స్‌లో నివసిస్తున్నారు. ఈయన ప్రైవేట్‌ సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తున్నారు. శివప్రసాద్‌ ఈ నెల 5వ తేదీ ఉదయం 10 గంటలకు స్వగ్రామానికి వెళ్తున్నానని భార్యకు చెప్పి, ఇంటి వద్ద బయల్దేరారు. సోమవారం ఉదయం 6.30 గంటలకు రామాలయం సమీపంలోని కల్వర్టు కింద మృతదేహం ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. 

స్థానికంగా కలకలం రేగడంతో సంఘటన స్థలంలో పరిశీలించి, చనిపోయిన వ్యక్తి తన భర్త శివప్రసాద్‌గా పద్మజ గుర్తించింది. భర్త మరణంపై అనుమానం ఉందని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించి, మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. మృతుడు మద్యం వ్యసనపరుడని, సొంత ఊరులోని ఆస్తిపాస్తులు అమ్ముకున్నాడని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు.

చికిత్స పొందుతూ వివాహిత మృతి

సంతకవిటి: మండల కేంద్రానికి చెందిన మెంటి దేవి (27) చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు హెడ్‌ కానిస్టేబుల్‌ వి.రామకృష్ణ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. రేగిడి మండలం పెద్దపుర్లి గ్రామానికి చెందిన ఎం.గోవిందరావు, మంగమ్మల కుమార్తె దేవికి సంతకవిటికి చెందిన మహేష్‌తో ఆరేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు. సెప్టెంబర్‌ 28న భర్త తాగి రావడంతో బెదిరించాలనే ఉద్దేశంతో దేవి పురుగు మందు తాగింది. వెంటనే కుటుంబ సభ్యులు గుర్తించి రాజాంలోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌కు తరలించగా.. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం 29న శ్రీకాకుళంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి రిఫర్‌ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. మృతురాలి తండ్రి ఎం.గోవిందరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

జాతర చూసేందుకు ప్రత్యేక స్క్రీన్‌లు

విజయనగరం: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు పైడితల్లి జాతర మహోత్సవాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు అవసరమైన పెద్ద స్క్రీన్‌ లను విజయనగరం నగరపాలక సంస్థ అధికారులు ఏర్పాటుచేశారు. మయూరి, అంబేడ్కర్‌ కూడలిలో స్క్రీన్‌లను ఏర్పాటు చేసినట్టు కమిషనర్‌ నల్లనయ్య తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement