
పైడితల్లి పండుగకు ఆర్టీసీ సర్వీసులు
విజయనగరం అర్బన్: పైడితల్లి జాతర సందర్భంగా వివిధ జిల్లాల నుంచి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక సర్వీసులు నిర్విహిస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణాధికారి జి. వరలక్ష్మి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి వచ్చేందుకు సోమవారం 40 బస్సులు వేయగా.. మంగళవారం 70, బుధవారం 30 బస్సులు తిప్పనున్నట్లు పేర్కొన్నారు. విశాఖ, సింహాచలం, అనకాపల్లి, శ్రీకాకుళం, చీపురుపల్లి, పాలకొండ, సాలూరు, పార్వతీపురం, ఎస్.కోట ప్రాంతాల నుంచి బస్సు సౌకర్యం కల్పి స్తున్నట్లు తెలిపారు. భక్తులు ఆర్టీసీ సర్వీసులను వినియోగించుకోవాలని కోరారు.
వైభవంగా మహా పూర్ణాహుతి
నెల్లిమర్ల రూరల్: రామతీర్థం సీతారామస్వామి దేవస్థాన క్షేత్ర పాలకులైన ఉమా సదాశివాలయంలో కామాక్షి అమ్మవారికి సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పౌర్ణమి సందర్భంగా అమ్మవారి సన్నిధిలో మహా పూర్ణాహుతి కార్యక్రమం అత్యంత వైభవంగా చేపట్టారు. ప్రధానార్చకుడు మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో ముందుగా గణపతి పూజ నిర్వహించిన అనంతరం శివుడికి ప్రత్యేక అభిషేకాలు జరిపించారు. అనంతరం కామాక్షి అమ్మవారిని వివిధ రకాల పుష్పాలు, స్వర్ణాభరణాలతో సుందరంగా అలంకరించి కుంకుమ పూజలు, అర్చనలు నిర్వహించారు. సుమారు మూడు గంటల పాటు హోమాలు చేపట్టి మహా పూర్ణాహుతి జరిపించారు. పూర్ణాహుతిలో మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, బడ్డుకొండ ప్రదీప్ నాయుడు, నగర పంచాయతీ వైస్ చైర్మెన్ కారుకొండ కృష్ణారావు, సర్పంచ్ అంబళ్ల కిరణ్, నాయకులు అట్టాడ శ్రీధర్, సత్యనారాయణ, భక్తులు పాల్గొన్నారు.

పైడితల్లి పండుగకు ఆర్టీసీ సర్వీసులు