
తోటపల్లి ఆధునికీకరణ పనులకు మోక్షం కలిగేనా..!
రైతన్నలను మోసగించారు..
చిత్తశుద్ధ్ది ఉంటే పనులు చేపట్టాలి
ప్రభుత్వానికి తెలియజేశాం..
రూ.300 కోట్లు అవసరం
వీరఘట్టం: ఈ ఏడాది ఖరీఫ్‌కు జూలై 16న తోటపల్లి పాత ఆయకట్టులోని కుడి, ఎడమ కాలువలకు జల వనరుల శాఖ అధికారులు సాగునీరు విడుదల చేశారు. నీరు విడిచిపెట్టి నెల రోజులు గడిచినా పాలకొండ శివారు ఆయకట్టుకు తోటపల్లి కాలువల ద్వారా నీరు అందకపోవడంతో ఆకు మడులు ఎండిపోతున్నాయని, తక్షణమే పాలకొండ శివారుకు నీరందెలా చేయాలని అన్నదాతలు రోడ్డెక్కారు. అన్నదాతలు ఎంత గగ్గోలు పెట్టినా ఎవరూ పట్టించుకోలేదు. చివరకు వరుణదేవుని కరుణతో వర్షాలు పుష్కలంగా కురవడంతో పాలకొండ శివారు ఆయకట్టు రైతులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదే విషయాన్ని ఇటీవల జరిగిన వీరఘట్టం మండల సర్వసభ్య సమావేశంలో జల వనరుల శాఖ ఏఈ డి.వి.రమణ స్పష్టం చేశారు. వర్షాలు సకాలంలో కురవడంతో ఖరీఫ్ గెట్టెక్కిందన్నారు. మరో రెండు నెలల్లో ఖరీఫ్ సీజన్ ముగియనుంది. ఈ ఏడాది డిసెంబర్ నుంచి కాలువ పనులు చేసేందుకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. అయితే ఎంతో ప్రాధాన్యత ఉన్న తోటపల్లి పాత ఆయకట్టు ఆధునికీకరణ అంశంపై కూటమి ప్రభుత్వం కనీసం స్పందించకపోవడంపై రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తోటపల్లి పేరుతో ఓట్లు దండుకున్నారు..
ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కనీసం తోటపల్లి పాత ఆయకట్లు కాల్వల ఆధునికీరణ పనుల అంశాన్ని ప్రస్తావించ లేదు. దీంతో ఇక తోటపల్లి పాత ఆయకట్టు ఆధునికీకరణకు ఎప్పుడు మోక్షం కలుగుతుందా.. అని రైతులు ప్రశ్నిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల ముందు కూటమి నాయకులు తోటపల్లి పేరు చెప్పుకుని ఓట్లు దండుకొని ఇప్పుడు విస్మరించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అసెంబ్లీ సమావేశాల్లో తోటపల్లి ఊసెత్తని ప్రభుత్వం
మరో రెండు నెలల్లో ముగియనున్న ఖరీఫ్ సీజన్
ఈ ఏడాది వరుణిడి కరుణతో గట్టెక్కిన ఖరీఫ్
ఏడాది కిందట తోటపల్లి ఆధునికీకరణ పనులను రద్దు చేసిన కూటమి ప్రభుత్వం
తోటపల్లి పాత ఆయకట్టు పరిధి సుమారు 64 వేల ఎకరాలు
తోటపల్లి పాత ఆయకట్టును సస్యశ్యామలం చేస్తామని ఎన్నికల ముందు రైతాంగానికి కల్లబొల్లి మాటలు చెప్పిన కూటమి ప్రభుత్వం ఈ ప్రాంత రైతాంగాన్ని మోసగించింది. ఆపేసిన తోటపల్లి పాత ఆయకట్టు ఆధునికీకరణ పనులను వెంటనే ప్రారంభించాలి. లేదంటే రైతులతో కలసి వైఎస్సార్‌సీపీ పోరాడుతుంది. – పొట్నూరు లక్ష్మణరావు, రైతు,
వైఎస్సార్‌సీపీ యువజన విభాగం అధ్యక్షుడు,
తెట్టంగి, వీరఘట్టం మండలం
ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీలను కూటమి నాయకులకు చిత్తశుద్ధి ఉంటే నిలబెట్టుకోవాలి. తోటపల్లి పాత ఆయకట్టు కాలువ పనులు నిలిపివేయడం పద్ధతి కాదు. చంద్రబాబు ఈ ప్రాంత రైతులకు వెన్నుపోటు పొడిచారు.
– దమలపాటి వెంకటరమణనాయుడు, ఎంపీపీ, వీరఘట్టం
తోటపల్లి పాత ఆయకట్టు కాలువల ఆధునికీకరణ పనుల విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేశాం. గతంలో జరిగిన ఈ పనులు 25 శాతం కంటే తక్కువ చేపట్టినందున ఈ పనులు ప్రభుత్వం నిలిపివేసింది. ప్రస్తుతం ఈ అంశం ప్రభుత్వ పరిధిలో ఉంది.
– వై.గన్నిరాజు, డీఈఈ,
జల వనరుల శాఖ, పాలకొండ డివిజన్
ప్రస్తుతం తోటపల్లి పాత ఆయకట్టు ఆధునికీకరణ పనులు చేపట్టాలంటే రూ.300 కోట్లు ఖర్చవుతుందని అధికారులు తెలిపారు. ఈ మేరకు ఈ ఫైల్‌ను ప్రభుత్వానికి అందజేశాం. అయితే నిధుల కొరత ఉందని ప్రభుత్వం తెలిపింది. ప్రసుత్తం ఈ పనులు నిలిచిపోవడంతో రైతులు పడుతున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లాం. కనీసం పెద్దబుడ్డిడి వద్ద ఉన్న సైఫన్‌ను బాగు చేసేందుకై నా నిధులు విడుదల చేయాలని కోరాం. – పొదిలాపు విజయరమణి,
తోటపల్లి ప్రాజెక్టు కమిటీ చైర్మన్

తోటపల్లి ఆధునికీకరణ పనులకు మోక్షం కలిగేనా..!

తోటపల్లి ఆధునికీకరణ పనులకు మోక్షం కలిగేనా..!

తోటపల్లి ఆధునికీకరణ పనులకు మోక్షం కలిగేనా..!