
కూరగాయల రైతు కుయ్యో..మొర్రో..!
రామభద్రపురం: ఈ నెలలో బంగాళాఖాతంలో ఏర్పడిన వరుస తుఫాన్ల కారణంగా కురుస్తున్న వర్షాలతో కూరగాయ రైతు కుదేలయ్యాడు. రోజూ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కూరగాయల పంటలు పూర్తిగా పాడై రైతులు నష్టాలపాలవుతున్నారు. కుటుంబమంతా ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు తమ కళ్ల ఎదుటే పాడవడం చూసి రైతులు గగ్గోలు పెడుతున్నారు. ప్రకృతి సహకరించక తుఫాన్‌ల వల్ల రోజులు తరబడి కురుస్తున్న వర్షాల కారణంగా పంట భూముల్లో నీరు చేరి ఊటపట్టి కూరగాయ పంటలు పాడవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బొబ్బిలి నియోజకవర్గంలోని రామభద్రపురం, బొబ్బిలి, బాడంగి,తెర్లాం మండలాల్లోని రైతులు అధికంగా కూరగాయలు పండిస్తున్నారు. 500 పైబడి ఎకరాలలో వంగ, టమాటో, బెండ, చిక్కుడు, కాలిఫ్లవర్, క్యాబేజీ, పొట్టి, పొడవు చిక్కుడు, దొండ, పర్చిమిర్చి, బంతి, ఉల్లి తదితర పంటలతో పాటు ఆకూరలు సాగవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.అయితే పంటలు ఏపుగా పెరిగి ఆశించిన స్థాయిలో దిగుబడి వస్తుందన్న సమయంలో వరుస తుఫాన్ల ప్రభావం పడింది. దీంతో పంటల్లో నీరు చేరి భూమి ఊటపట్టడంతో వేరు కుళ్లు తెగులు సోకి మిరప, వంగ, టమాటో మొక్కలు చనిపోతున్నాయి. అలాగే దుంప జాతులతో పాటు ఆకుకూరల పంటలు పాడవుతున్నాయి. కాలిఫ్లవర్‌లో నీరు చేరి ఆరుతున్న కొద్దీ కుళ్లిపోతోంది. ఉల్లిపంట భూమి ఇవకపట్టి కుళ్లిపోతోంది. ఆకు కూరలకు మచ్చ తెగులు సోకి నాణ్యత, దిగుబడి తగ్గిపోతున్నాయి. చిక్కుడు, దొండ, కాకర. తదితర తీగ జాతి పంటలకు వివిధ రకాల తెగుళ్లు సోకి పూత, పిందె రాలిపోతున్నాయి. వివిధ రకాల చీడపీడలు ఆశించి పంటలను నాశనం చేస్తున్నాయి. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో విలవిలలాడుతున్నారు. ప్రకృతి విపత్తులకు తోడుగా తెగుళ్లు సోకడంతో పెట్టుబడులు సైతం కోల్పోయే పరిస్థితి నెలకొంది. తాము అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి ఎంతో ఆశతో కష్టపడి పండించిన పంట తుఫాన్ల కారణంగా నష్టాల బారిన పడుతున్నామని వాపోతున్నారు. నష్టపోయిన రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు.
ఈ చిత్రంలో కనిపిస్తున్న రైతు రామభద్రపురం గ్రామానికి చెందిన కర్రి సాంబ. సుమారు ఎకరా విస్తీర్ణంలో వివిధ కూరగాయ పంటలు సాగు చేస్తూ దాదాపు రూ.30 వేలకు పైగా పెట్టుబడి పెట్టాడు.అయితే తుఫాన్ వల్ల ఎంతో కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో చూస్తుండగానే కుళ్లిపోతోంది. పెట్టుబడి పోవడమే కాకుండా లాభం రావాల్సిన మరో రూ.50వేలు పోయే పరిస్థితి నెలకొంది. పంటల సాగుకు అధికంగా పెట్టుబడులు పెట్టడంతో పాటు కుటుంబమంతా ఆరుగాలం కష్టపడినా ప్రకృతి సహకరించడంలేదని చనిపోతున్న మిరప మొక్కలను చూపుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
వరుస తుఫాన్ల ప్రభావంతో కుదేలు
ఊటబారి మొక్కలు చనిపోతూ,
రాలిపోతున్న పూత, పిందె
పెట్టుబడి దక్కదంటున్న రైతులు
నియోజకవర్గంలో 500కు పైబడి ఎకరాల్లో సాగవుతున్న కూరగాయ పంటలు
పంట నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని వేడుకోలు
పరిశీలిస్తాను..
సాధారణంగా నీరు అధికంగా ఉన్న భూముల్లో వేరు కుళ్లు తెగులు సోకుతుంది. కూరగాయల పంటల్లో నీరు నిల్వ ఉండకుండా బయటకు తీసేయాలి. క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి పంట నష్టాలను అంచనా వేసి, నివేదికలు పంపిస్తాం. ఉద్యానశాఖాధికారులు చెప్పిన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఆధిక దిగుబడులు సాధించవచ్చు.
పి.మోహనకృష్ణ ఉద్యానశాఖ అధికారి
ప్రభుత్వం ఆదుకోవాలి
తుఫాన్ కారణంగా కూరగాయ పంటలు మా కళ్ల ఎదుటే నాశనమయ్యాయి.ఆ ప్రభావం దిగుబడులపై పడి పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. కూరగాయ పంటలు సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. నష్ట పరిహారం చెల్లించి ప్రభుత్వం ఆదుకోవాలి.
మూడడ్ల పైడితల్లి
కూరగాయల రైతు, రామభద్రపురం
తీవ్రంగా నష్టపోయాం..
చిన్నప్పటి నుంచి కూరగాయల పంటలు సాగు చేస్తున్నాను. వాతావరణ పరిస్థితుల కారణంగా అధికంగా కూరగాయల పంటలు నష్టపోవడం ఇదే మొదటిసారి చూస్తున్నాను. నోటికాడికి వచ్చిన అన్నం ముద్దను తీసేసిన చందంగా ఉంది. అప్పు చేసి రూ.25 వేలు పెట్టుబడి పెట్టి అర ఎకరా విస్తీర్ణంలో ఉల్లి నాటాను. అలాగే కాలిఫ్లవర్ పంట వేశాను. తుఫాన్ కారణంగా ఉల్లి మొక్క బయటకు రాకముందే కుళ్లిపోతోంది. కాలిఫ్లవర్ పంట చేతికందుతుందన్న సమయంలో పంట పాడవడంతో అప్పులు పాలవుతున్నాను.
కర్రి చిన్నమ్మతల్లి. రైతు, రామభద్రపురం

కూరగాయల రైతు కుయ్యో..మొర్రో..!

కూరగాయల రైతు కుయ్యో..మొర్రో..!

కూరగాయల రైతు కుయ్యో..మొర్రో..!

కూరగాయల రైతు కుయ్యో..మొర్రో..!

కూరగాయల రైతు కుయ్యో..మొర్రో..!

కూరగాయల రైతు కుయ్యో..మొర్రో..!

కూరగాయల రైతు కుయ్యో..మొర్రో..!