
అమ్మవారి పండగ ప్రశాంతంగా జరగాలి
● జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి వంగలపూడి అనిత
విజయనగరం అర్బన్: పైడితల్లి అమ్మవారి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరపాలని, ప్రతి సాధారణ భక్తుడికి చక్కటి దర్శనం లభించేలా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. అధికారులు అందుకు తగ్గట్టుగా సన్నద్ధం కావాలని సూచించారు. ఈ మేరకు శనివారం ఆమె కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో కలెక్టర్ ఎస్.రామ్‌సుందర్ రెడ్డితో కలిసి అమ్మవారి పండగ, విజయనగరం ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్షించారు. తొలుత ఏర్పాట్లపై మంత్రికి కలెక్టర్ వివరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పోలీస్ శాఖ, రెవెన్యూ , దేవస్థానం వారు కలిసి కంట్రోల్ రూమ్ నుంచి అనునిత్యం పర్యవేక్షించాలని, విదు్‌య్త్ అంతరాయం లేకుండా చూడాలని, తాగునీటి సరఫరా ప్లాస్టిక్ రహితంగా సక్రమంగా జరిగేలా చూడాలని తెలిపారు. టాయిలెట్ల ఏర్పాటు, పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. మహిళలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున 170 బస్సుల వరకు అవసరం అవుతాయని, ఆయా రూట్లలో బస్సులను ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యుత్ అలంకరణలు, నగరమంతా సుందరీకరణ వారం రోజుల పాటు ఉంచాలని, పండగ వాతావరణం వెల్లివిరిసేలా ఉండాలన్నారు.
స్థానిక శాసన సభ్యురాలు పూసపాటి అదితి గజపతి రాజు మాట్లాడుతూ వీఐపీ దర్శనాలకు ఇబ్బంది కలగకుండా ప్రోటోకాల్ అధికారులు జాగ్రత్తగా చూడాలన్నారు. రథాలన్నీ తనిఖీలు చేసుకుని, వలంటీర్లకు, సేవా ప్రతినిధులకు ఐడీ కార్డులను జారీ చేయాలన్నారు.
7న పట్టువస్త్రాల సమర్పణ
కలెక్టర్ ఎస్.రామ్‌సుందర్ రెడ్డి మాట్లాడుతూ దేవదాయ శాఖమంత్రి ఆనం రాం నారాయణ రెడ్డి అమ్మవారికి 7 వ తేదీన ఉదయం పట్టు వస్త్రాలు సమర్పిస్తారని, అందుకు తగ్గ ఏర్పాట్లను దేవాదాయ శాఖ వారు చేయాలని ఆదేశించారు. సాధారణ భక్తులకు ఇబ్బంది కలగకుండా , గర్భగుడిలో పూజలు ఎక్కువ సమయం నిర్వహించరాదని, ఆర నిమిషం కన్నా భక్తులను లోపల ఉంచరాదని స్పష్టం చేశారు. విజయనగరం ఉత్సవాల ఏర్పాట్ల పై సంయుక్త కలెక్టర్ సేతుమాధవన్ వివరించారు. సమావేశంలో ఎస్పీ ఏఆర్ దామోదర్, అదనపు ఎస్పీ సౌమ్యలత, కాపు కార్పొరేషన్ చైర్‌పర్సన్ యశస్వి, డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
విజయనగరం ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి
ఈ నెల 5,6 వ తేదీల్లో రెండు రోజుల పాటు విజయనగరం జిల్లాలో ఘనంగా జరగనున్న విజయనగరం ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఉత్సవాల ప్రారంభోత్సవానికి హోం మంత్రి వంగలపూడి అనితను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా టూరిజం ఆఫీసర్ కుమారస్వామి విశాఖపట్నంలోని ఆమె క్యాంప్ కార్యాలయంలో మంత్రి అనితకు ఉత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం మంత్రి ఉత్సవాల ఏర్పాట్లపై చర్చించారు. విజయనగరం జిల్లా చారిత్రక ప్రాముఖ్యతను దేశమంతటా తెలియజేయాలన్న ఉద్దేశంతో, ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని మంత్రి అనిత అధికారులకు సూచించారు. ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.