
అంగన్‌వాడీల ఆకలికేకలు..!
విజయనగరం ఫోర్ట్: అధికారంలోకి వస్తే ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తామని కూటమి సర్కార్ గొప్పలు చెప్పింది. ఒకటో తేదీ మాట దేవుడెరుగు ఏ నెలకు అనెల కూడా జీతాలు పడని పరిస్థితి నెలకొంది. అధికారంలోకి రాకముందు మాటలకు, అధికారం చేపట్టిన తర్వాత మాటలకు పొంతన ఉండడం లేదని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. ఐసీడీఎస్ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలకు గడిచిన రెండు నెలలుగా జీతాలు పడని పరిస్థితి. వచ్చే జీతం తక్కువ. అది కూడా సకాలంలో పడక పోవడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీతాలు అందకపోవడం వల్ల పిల్లల ఫీజులు, కుటుంబ పోషణ కష్టతరంగా మారుతుందని వాపోతున్నారు.
జిల్లాలో 11 ఐసీడీఎస్ ప్రాజెక్టులు
జిల్లాలో 11 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. భోగాపురం, విజయనగరం, రాజాం, చీపురుపల్లి, బొబ్బిలి, వియ్యంపేట, ఎస్.కోట, బాడంగి, గంట్యాడ, గజపతినగరం, గరివిడి ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. వాటి పరిధిలో 2499 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 293 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. 2206 మెయిన్ అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. మినీ అంగన్‌వాడీ కేంద్రాల్లో మినీ అంగన్‌వాడీ కార్యకర్తలు, మెయిన్ అంగన్‌వాడీ కేంద్రాల్లో కార్యకర్తలతో పాటు ఆయాలు పనిచేస్తారు.
రెండు నెలలుగా అందని వేతనాలు:
అంగన్‌వాడీలకు రెండు నెలలుగా జీతాలు అందలేదు. ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు సంబంధించి జీతాలు అందలేదు. అంగన్వాడీ కార్యకర్తకు నెలకు రూ.11,500,మినీ అంగన్ కార్యకర్తకు రూ.7000, ఆయాకు రూ.7000 చొప్పన జీతాలు చెల్లించాలి. అయితే రెండు నెలలకు సంబంధించి అంగన్‌వాడీ కార్యకర్తలకు రూ.23000, మినీ అంగన్‌వాడీ కార్యకర్తకు రూ. 14 వేలు, ఆయాకు రూ 14 వేలు చెల్లించాల్సి ఉంది.
బిల్లు పెట్టాం
అంగన్‌వాడీ కార్యకర్తలకు, ఆయాలకు రెండు నెలలకు సంబంధించి జీతాలకు సంబంధించి బిల్లు పెట్టాం. ఆర్‌బీఐలో పెండింగ్ ఉండవచ్చు.
టి.విమలారాణి, పీడీ, ఐసీడీఎస్
రెండు నెలలుగా అందని జీతాలు