
పైడితల్లి జాతర భద్రత ఏర్పాట్ల పరిశీలన
విజయనగరం క్రైమ్: ఈ నెల 5, 6, 7 తేదీల్లో విజయనగరం ఉత్సవాలు, శ్రీ పైడితల్లి అమ్మవారి తొలేళ్లు, సిరిమానోత్సవం జరగనున్న నేపథ్యంలో భద్రత, బందోబస్తు ఏర్పాట్లను కలెక్టర్ ఎస్.రామ్‌సుందర రెడ్డితో కలిసి ఎస్పీ దామోదర్ శనివారం పరిశీలించారు. ఈ సందర్బంగా అమ్మవారి దేవాలయం వద్ద, భక్తుల దర్శనాలకు ఏర్పాటు చేసిన క్యూలను పరిశీలించారు. ఆలయం ఎదురుగా ఏర్పాటు చేయనున్న రెవెన్యూ, పోలీసు శాఖల తాత్కాలిక కంట్రోల్ రూమ్‌లను, అలాగే ఆలయం పరిసర ప్రాంతాలను, దర్శనాలకు భక్తులు వచ్చి, దర్శనం అనంతరం ఆలయం బయటకు వెళ్ళే మార్గాలను తనిఖీ చేశారు. సిరిమాను తిరిగే మార్గం మూడు లాంతర్ల జంక్షన్, కోట, గురజాడ అప్పారావు రోడ్డు జంక్షన్, మసీదు జంక్షన్, జియర్ కాంప్లెక్స్, కోట లోపల వరకు కాలి నడకన వెళ్లి క్షేత్రస్థాయిలో బారికేడ్లను ఏర్పాటు, కటాఫ్ పాయింట్స్ వద్ద భద్రత, బందోబస్తు ఏర్పాట్లను స్వయంగా పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేసి, చేయాల్సిన పనుల గురించి దిశానిర్దేశం చేశారు. విజయనగరం ఉత్సవాలు, అమ్మవారి తొలేళ్లు, సిరిమానోత్సవంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అమ్మవారి దర్శనాల్లో సామాన్య భక్తులకు ప్రాధాన్యం కల్పించాలని, వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ ఎస్.రామ్‌సుందర రెడ్డి, ఎస్పీ ఎఆర్ దామోదర్ ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఆర్డీఓ దాట్ల కీర్తి, డీఎస్పీ ఆర్.గోవిందరావు, దేవదాయశాఖ ఏసీ శిరీష, మున్సిపల్, ఆర్‌అండ్‌బీ అధికారులు, పలువురు సీఐలు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
గాంధీ విగ్రహం ధ్వంసం కేసులో 8 మంది గుర్తింపు
సాలూరు: మండలంలోని మామిడిపల్లి జెడ్పీ హెచ్ పాఠశాల ఆవరణ వద్ద గురువారం గాంధిజీ విగ్రహం ధ్వంసం చేసిన కేసులో దుండగులను గుర్తించినట్లు ఎస్సై నర్సింహమూర్తి తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన మా ట్లాడుతూ, ఈ ఘటనలో మామిడిపల్లి గ్రామానికి చెందిన 8 మంది దుండగులను గుర్తించి అదుపులోకి తీసుకున్నామన్నారు. వారిలో ఇద్దరు మైనర్‌లు ఉన్నారని, ఆరుగురిపై కేసు నమోదుచేసి అరెస్ట్ చేశామని తెలిపారు.