
రైతన్నను ఆదుకోవాలి
● మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర
సాలూరు: ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర డిమాండ్ చేశారు. మండలంలోని తోణాం, కందులపదం పంచాయతీల్లో నేలకొరిగిన అరటి, మొక్కజొన్న పంటలను బాధిత రైతులతో కలిసి ఆయన శనివారం పరిశీలించారు. పంట పెట్టుబడి, నష్టం వివరాలను రైతులను అడిగితెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి, వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును కోరారు. లేదంటే రైతులు అప్పుల్లో కూరుకుపోతారన్నారు. అందరికీ అన్నంపెట్టే రైతును ఆదోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గత ప్రభుత్వం వైఎస్సార్ ఉచిత పంటల బీమాతో విపత్తుల సమయంలో రైతన్నను ఆదుకునే విషయాన్ని గుర్తుచేశారు. ఆయన వెంట రెడ్డి సురేష్, సువ్వా భరత్‌శ్రీనివాస్, మువ్వల ఆదయ్య, సువ్వాడ రామకృష్ణ, కన్నంనాయుడు, సంతోష్, ఆనందరావు, కృష్ణ, నాగేశ్వరరావు, రామారావు, తదితరులు పాల్గొన్నారు.