
విద్యార్థుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేస్తే చర్యలు
● ఏపీ గురుకుల ముఖ్య కార్యదర్శి ఎం.గౌతమి
కురుపాం: విద్యార్థులకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించేలా అధికారులు చర్యలు చేపట్టాలని, విద్యార్థుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఆంధ్రప్రదేశ్ గురుకుల ముఖ్య కార్యదర్శి ఎం.గౌతమి హెచ్చరించారు. కురుపాం గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను పార్వతీపురం ఐటీడీఏ పీఓ యశ్వంత్ కుమార్ రెడ్డితో కలిసి శనివారం సందర్శించారు. మొదటిగా పాఠశాల సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం తరగతి గదులు, మరుగుదొడ్లు, డార్మిటరీ, కిచెన్, స్టాక్ రూమ్‌లను పరిశీలించారు. వంట పనివారికి కిచెన్ నిర్వహణలో పాటించాల్సిన పారిశుద్ధ్య పనులపై సూచనలు చేశారు. రెండు నెలల పాటు పాఠశాల ఆవరణలో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని ఎంపీడీఓ ఉమామహేశ్వరిని ఆదేశించారు. అదనపు మరుగుదొడ్లను తక్షణమే మంజూరు చేస్తున్నామని అదనపు మరుగుదొడ్లు, తరగతి గదులు డార్మిటరీ నిర్మాణానికి అవసరమైన చర్యలు త్వరలోనే తీసుకుంటామన్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికల ఆరోగ్యం నిలకడగానే ఉందని, అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. విశాఖ కేజీహెచ్‌లో 22 మంది, పార్వతీపురం ఏరియా ఆస్పత్రిలో 85 మందికి మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయన్నారు. నలుగురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉండడంతో కేజీహెచ్‌లో అత్యవసర సేవల విభాగంతో వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. విద్యార్థుల ఆరోగ్యంపై జిల్లా అధికారులు నిరంతర పర్యవేక్షణ ఉందన్నారు. పాఠశాలలో సమస్యలుంటే వెంటనే ఐటీడీఏ పీఓతోపాటు తనకు నేరుగా తెలపాలని ఆదేశించారు. ఈ సందర్శనలో ఆమె వెంట గిరిజన సంక్షేమశాఖ డీడీ కృష్ణవేణి, ప్రిన్సిపాల్ అనూరాధ, తహసీల్దార్ కె.జయ, గురుకుల కో ఆర్డినేటర్ సురేష్, పంచాయతీ ఈఓ కె.సురేష్ ఉన్నారు.