
బాలికల ఆరోగ్యంపై కలెక్టర్ ఆరా
పార్వతీపురంటౌన్: జిల్లా కేంద్రాస్పత్రిలో చికిత్స పొందుతున్న కురుపాం బాలికల గురుకుల పాఠశాల/కళాశాల విద్యార్థినులను కలెక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి శుక్రవారం పరామర్శించారు. ఆరోగ్యంపై ఆరా తీశారు. బాలికలు దసరా సెలవులకు ఇంటికి వెళ్లిన తర్వాత పచ్చకామెర్ల బారిన పడినట్టు ఆయన తెలిపారు. గురుకులంలో చదువుతున్న బాలికలందరికీ వైద్య పరీక్షలు చేయిస్తున్నామని, అవసరమైన వారిని ఆస్పత్రికి తరలించి వైద్యసేవలు అందిస్తున్నట్టు తెలిపారు. అస్వస్థతకు గురైన 50 మందిలో 20 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు వెల్లడించారు. ఇద్దరు విద్యార్థినులను మెరుగైన చికిత్సకోసం విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించామన్నారు. బాలికలు అనారోగ్యానికి గురికావడానికి కారణాలు తెలుసుకునేందుకు ప్రత్యేక బృందాన్ని నియమించామని తెలిపారు. వారిచ్చే నివేదిక ఆధారంగా ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పా రు. ఆయన వెంట జేసీ సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి, వైద్యారోగ్య శాఖ సూపరింటెండెంట్ నాగ శివజ్యోతి, డీసీహెచ్‌ఎస్ నాగభూషణం, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.