
అడ్మిషన్లకు ‘పెన్’ చాలు
పార్వతీపురం రూరల్: జిల్లాలో ఉన్నత విద్య అడ్మిషన్ల ప్రక్రియను సులభతరం చేస్తూ కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. డిగ్రీ వంటి కోర్సుల్లో చేరేందుకు ఇకపై విద్యార్థులు ఎలాంటి సర్టిఫికెట్లు సమర్పించాల్సిన అవసరం లేదని, కేవలం అపార్ ఐడీ, పర్మనెంట్ ఎడ్యుకేషన్ నంబర్ (పెన్) ఉంటే సరిపోతుందని స్పష్టం చేశారు. విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ, జిల్లాలో ఏ ఒక్క విద్యార్థి డిగ్రీకి దూరం కాకూడదన్నారు. బడి మానేసిన, 10వ తరగతి, ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులను గుర్తించి తిరిగి చేర్పించాలని ఆదేశించారు. విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం, గార్మెంట్ టెక్నాలజీలో శిక్షణతో పాటు, ప్రతిరోజూ యోగా, హెచ్‌బీ స్థాయి పెంపుపై దృష్టి సారించాలని సూచించారు. 5 నుంచి 10వ తరగతి విద్యార్థులకు కనీస విద్యా ప్రమాణాలైన చదవడం, రాయడం తప్పనిసరిగా వచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీఈఓ రాజకుమార్, ఇతర విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.
రైతన్నకు జీఎస్టీ 2.0తో ఊరట
వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేలా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) 2.0సంస్కరణలు రైతాంగానికి ఎంతో మేలు చేకూర్చనున్నాయని కలెక్టర్ డా.ఎన్. ప్రభాకర రెడ్డి అన్నారు. ఈ పన్ను తగ్గింపు ప్రయోజనాలపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచారం చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్‌తో కలిసి జీఎస్టీ 2.0 అవగాహన కరపత్రాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి కె. రాబర్ట్ పాల్, జీఎస్టీ నోడల్ ఆఫీసర్ డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి