
పులిగుహ మెట్టపై ఏనుగులు
భామిని: మండలంలోని తివ్వాకొండల్లోని పులిగృహ మెట్టపైకి మంగళవారం నాలుగు ఏనుగుల గుంపు చేరింది. పగలంతా మెట్టపై ఉండి సాయంత్రం పంట పొలాల్లో సంచరిస్తూ నష్టం చేకూర్చుతున్నాయని గిరిజనులు వాపోతున్నారు.
పారాది కాజ్‌వేపై వరద నీరు
బొబ్బిలిరూరల్: అంతరరాష్ట్ర రహదారిలో పారాది గ్రామం వద్ద వేగావతినదిపై నిర్మించిన తాత్కాలిక కాజ్‌వేను మంగళవారం వరదనీరు ముంచెత్తింది. నదీ పరీవాహక ప్రాంతంలో కురిసిన వర్షాలకు వేకువజాము నుంచి కాజ్‌వేపై వరదనీరు ప్రవహిస్తుండడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఉదయం ఏడు గంటలకు వరదనీరు తగ్గుముఖం పట్టడంతో ఆర్‌అండ్‌బీ అధికారులు వాహనాల రాకపోకలకు అనుమతించారు.
ఆర్థిక బకాయిలు చెల్లించండి
● ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
ఎస్.చిరంజీవి
విజయనగరం అర్బన్: ఉద్యోగుల ఆర్థిక బకాయిలను తక్షణమే చెల్లించాలని, పీఆర్‌సీ కమిషన్ నియమించాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.చిరంజీవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా పరిషత్ మినిస్టీరియల్ హాల్‌లో మంగళవారం నిర్వహించిన ఏపీటీఎఫ్ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కనీసం 30 శాతం మధ్యంతర భృతి అమలు చేయాలని కోరారు. ఉమ్మడి సర్వీసుల సమస్య పరిష్కరించాలని, ఉపాధ్యాయులను బోధనేతర పనుల నుంచి విముక్తి కల్పించాలని డిమాండ్ చేశారు. సీఆర్‌పీ, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంచాలని, ఎంటీఎస్ ఉపాధ్యాయుల ఉద్యోగ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలని కోరారు. మున్సిపల్, మోడల్ స్కూల్, కేజీబీవీ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సంఘ జిల్లా అధ్యక్షుడు ఎం.బలరామనాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఎ.సదాశివరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.ఈశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి ధనంజయరావు, రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ ఆర్.కృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.వి.పైడిరాజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి.వెంకటనాయుడు, వై.మధుసూదనరావు, జిల్లా సహాధ్యక్షులు ఎస్.శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు.