
పింఛన్ల పంపిణీపై ఉత్కంఠ!
● ఇంటింటికీ వెళ్లేది లేదంటున్న సచివాలయ ఉద్యోగులు
సాక్షి, పార్వతీపురం మన్యం: తమ డిమాండ్ల పరిష్కారం కోరుతూ సచివాలయ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభావం అక్టోబర్ నెల పింఛన్లపై పడేలా కనిపిస్తోంది. వాస్తవానికి సచివాలయ ఉద్యోగులు తాము ప్రకటించిన నిరసనల షెడ్యూల్‌లో అక్టోబర్ 1న పింఛన్ల పంపిణీని యథావిధిగా చేపడతామని ప్రకటించారు. దీనిపై సచివాలయ ఉద్యోగుల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పింఛన్ల పంపిణీని ఆపితే గానీ ప్రభుత్వం దిగి రాదని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జేఏసీ నాయకులు.. వృద్ధులు, దివ్యాంగులకు మినహా మిగిలిన అందరికీ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు (కార్యాలయ పని వేళల్లో) సచివాలయాల వద్దే పంపిణీ చేస్తామని చెబుతున్నారు. దీనిని మరో వర్గం ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. తాము యథావిధిగా పంపిణీకి వెళ్తామని అంటున్నారు. వీరిలోనే రెండు వర్గాలుగా ఉండడంతో ఈ నెల పింఛన్ల పంపిణీ ఏ విధంగా సాగుతుందన్న విషయంలో సందిగ్ధత ఏర్పడింది. జిల్లాలో 1.40 లక్షల పింఛన్లు ఉన్నాయి. 15 మండలాల పరిధిలో 350 సచివాలయాలు ఉన్నాయి. సుమారు 3,238 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. గతంలో వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ వెళ్లి నేరుగా లబ్ధిదారులకు పింఛన్ల మొత్తం అందించేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థకు మంగళం పాడింది. అప్పటి నుంచి సచివాయల ఉద్యోగులతోనే ఆ పని చేయిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో గ్రామంలోని ఆలయాల వద్ద, రచ్చబండకు రప్పించి, పింఛన్లు అందించే పరిస్థితి ఉంది. వలంటీర్ల విధుల నుంచి తమను విముక్తి చేయాలని, రెండు సంవత్సరాల సర్వీసుకు రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, డోర్ టు డోర్ సర్వేలను అప్పగించవద్దని, నిర్ధిష్టమైన ప్రమోషన్లు కల్పించాలని, డిప్యుటేషన్ల నుంచి మినహాయించాలని సచివాలయ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం దిగిరాకపోవడంతో నిరసనలకు దిగారు. అధికారిక వాట్సాప్ గ్రూపుల నుంచి వైదొలుగుతున్నారు. ఈ పరిస్థితుల్లో పింఛన్ల పంపిణీకి జిల్లా యంత్రాంగం ఎటువంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటుందో చూడాలి.