
కూటమిలో ప్రొటోకాల్ రగడ
సీతంపేట: అన్న క్యాంటీన్ శంకుస్థాపన సాక్షిగా పాలకొండ నియోజకవర్గంలోని కూటమి నాయకు ల అంతర్గత కుమ్ములాటలు మరోమారు బహిర్గతమయ్యాయి. టీడీపీ, జనసేన నాయకుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. సీతంపేట గ్రామ సచివాలయం కార్యాలయం వద్ద రూ.60 లక్షలతో నిర్మించనున్న అన్న క్యాంటీన్ కు పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ సోమవా రం శంకుస్థాపన చేశారు. ప్రొటోకాల్ ప్రకారం తమను ఎందుకు పిలవలేదంటూ టీడీపీ పాలకొండ నియోజకవర్గ ఇన్‌చార్జి పడాల భూదేవి, మండల కన్వీనర్ సవర తోట ముఖలింగం, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పి.రాజబాబు, మాజీ ఎంపీటీసీ సభ్యురా లు బి.జయలక్ష్మి, ఏఎంసీ డైరెక్టర్ ఎం.మోహన్‌రావు, ఎస్.మంగయ్య తదితరులు నిర్వాహకులను నిలదీశారు. ముందస్తు సమాచారం ఇవ్వలేదని ఎమ్మెల్యేను సైతం ప్రశ్నించారు. ఓట్లు వేసిన కార్యకర్తలను వదిలేసి, ఎటువంటి అర్హత లేని వారికి ప్రాధాన్యమివ్వడం తగదన్నారు. చివరకు మాటా, మాటా పెరిగి జనసేన, టీడీపీ కార్యకర్తల మధ్య నువ్వా.. నేనా అన్నస్థాయిలో వాగ్వాదం చెలరేగింది. ఎస్‌ఐ వై.అమ్మన్నరావు జోక్యం చేసుకుని ఇరువర్గాలను సముదాయించారు.