
కూటమి నిర్లక్ష్యంతో... కమ్ముకోనున్న చీకట్లు
జిల్లాలోనూ తీవ్రమైన నిరసనలు
పార్వతీపురం రూరల్: కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరితో విద్యుత్ ఉద్యోగుల సహనం కట్టలు తెంచుకుంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను గాలికొదిలేసి, తమ సమస్యలను పట్టించుకోకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. తమ సమస్యలపై ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా స్పందన కరువవడంతో, వచ్చే నెల అక్టోబర్ 15వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్టు విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి(జేఏసీ) అల్టిమేటం జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో విద్యుత్ సరఫరాపై తీవ్ర ఆందోళన నెలకొంది. విద్యుత్ ఉద్యోగుల పట్ల కూటమి ప్రభుత్వం మొండి వైఖరి ఇలాగే కొనసాగితే రాష్ట్రం కారు చీకట్లలోకి జారుకునే ప్రమాదం పొంచి ఉంది.
మొండి చేయి చూపుతున్న ప్రభుత్వం
అధికారంలోకి వస్తే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చాక ఇప్పుడు తమ గోడును పట్టించుకోవడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) పునరుద్ధరణ వంటి కీలక హామీలపై ప్రభుత్వం ఉలుకుపలుకు లేకుండా వ్యవహరిస్తోందని జేఏసీ నేతలు మండిపడుతున్నారు. నెలలు తరబడి శాంతియుతంగా నిరసనలు, ధర్నాలు, కార్యాలయాల ఎదుట ఆందోళనలు చేస్తున్నా.. ప్రభుత్వంలో చలనం రాకపోవడంతో సమ్మె తప్ప మరో మార్గం లేదని వారు స్పష్టం చేస్తున్నారు. ఇటీవల జిల్లా కేంద్రాల్లోనూ, విద్యుత్ కార్యాలయాల వద్ద దశల వారీగా నిరసనలు చేపట్టినా ఫలితం శూన్యం కావడంతో ప్రస్తుతం వీరి ఉద్యమం రెండో దశకు చేరుకుంది.
ఏళ్లుగా మేము కోరుతున్న పీఆర్‌సీ అమలు, పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ, కారుణ్య నియామకాలు వంటి కీలకమైన అంశాలపై ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తోంది. ఉద్యోగుల సహనాన్ని పరీక్షించవద్దు. మా హక్కులు సాధించేంత వరకు మా పోరాటాన్ని దశల వారీగా మరింత ఉధృతం చేస్తాం. విద్యుత్ ఉద్యోగులందరూ ఈ నిరసనలో ఐక్యంగా పాల్గొంటారు.
– వంగపండు లక్ష్మణ, జేఏసీ చైర్మన్,
పార్వతీపురం మన్యం జిల్లా
రాష్ట్ర వ్యాప్త సమ్మె పిలుపులో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా, ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఉన్న సుమారు 1200 మంది విద్యుత్ ఉద్యోగులు కూడా ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా జిల్లా కేంద్రంలో నిరసన తెలిపి, తమ సమస్యల తీవ్రతను తెలియజేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం కళ్లు తెరిచి, రాష్ట్ర జేఏసీ నేతలను చర్చలకు పిలిచి, ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో వచ్చే నెల 15వ తేదీ నుంచి జరిగే సమ్మెలో జిల్లా ఉద్యోగులంతా ఏకతాటిపై నిలిచి పాల్గొంటారని, ప్రజలకు కలిగే అసౌకర్యానికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. మొత్తం మీద ప్రభుత్వ ఉదాసీన వైఖరి విద్యుత్ రంగంలో తీవ్ర సంక్షోభానికి దారితీసేలా ఉంది. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి తక్షణమే స్పందించి ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే, దాని పర్యవసానాలు తీవ్రంగా ఉండనున్నాయని విశ్లేషకులు సైతం హెచ్చరిస్తున్నారు.
హామీలు అమలు చేయకపోవడంతో రోడ్డెక్కిన విద్యుత్ ఉద్యోగులు
ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో రెండో దశకు చేరుకున్న నిరసనలు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆందోళన బాట పట్టిన 1200 మంది ఉద్యోగులు
ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఉద్యోగుల అల్టిమేటం
అక్టోబర్ 15 నుంచి నిరవధిక సమ్మెకు సై

కూటమి నిర్లక్ష్యంతో... కమ్ముకోనున్న చీకట్లు