
నేడు ఐటీడీఏలో పీజీఆర్‌ఎస్
సీతంపేట: స్థానిక ఐటీడీఏలోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) నిర్వహించనున్నారు. పాలకొండ సబ్‌కలెక్టర్, ఐటీడీఏ ఇన్‌చార్జ్ పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్ వినతులు స్వీకరించనున్నారు. గిరిజనులు తమ సమస్యలపై వినతులు సమర్పించవచ్చని అధికారులు తెలిపారు.
వైద్యుల సమ్మెకు ల్యాబ్ టెక్నీషియన్ల మద్దతు
వీరఘట్టం: తమ సమస్యల పరిష్కారానికి పోరాడుతున్న ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల వైద్యుల సమ్మెకు తమ సంపూర్ణ మద్దుతు ప్రకటిస్తున్నామని జిల్లా ల్యాబ్ టెక్నీషియన్ల అసోషియేషన్ అధ్యక్షుడు వై.తిరుపతిరావు తెలిపారు. ఆదివారం ఆయన వీరఘట్టంలో విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 26 నుంచి అన్ని పీహెచ్‌ల్లో వైద్యులు సమ్మె బాట పట్టారని, ఇందులో భాగంగా ఆన్‌లైన్ రిపోర్టింగ్ సేవలు బంద్ చేశారన్నారు. ఈ నెల 29న అన్ని పీహెచ్‌సీల్లో ఓపీ సేవలు బంధ్, 30న జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు, అక్టోబర్ 1న జిల్లా కేంద్రంలో నిరసన ర్యాలీలు, అక్టోబర్ 3న చలో విజయవాడ కార్యక్రమం చేపట్టనున్నట్టు తిరుపతిరావు తెలిపారు. ఇందుకు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్లు మద్దతు తెలిపి ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.
పల్లకిలో పోలమాంబ తిరువీధి
మక్కువ: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబర పోలమాంబ అమ్మవారి ఆలయంలో ఈవో బి.శ్రీనివాస్ ఆధ్వర్యంలో సప్తప్రాకార సేవ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. పోలమాంబ అమ్మవారిని గ్రామంలో పల్లకిలో తిరువీధి కార్యక్రమం నిర్వహించగా, మహిళలు కలశాలతో వెంట నడిచారు. పూజారి జన్ని పేకాపు భాస్కరరావు అమ్మవారి ఉత్సవమూర్తిని వనంగుడి చుట్టూ తలపై మోసుకుంటూ ప్రదక్షణలు చేశారు. వేదపండితులు కె.శ్రీనివాస్‌శర్మ హోమం, సప్తప్రాకారసేవ పూజలను అత్యంత వైభంగా నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ట్రస్ట్‌బోర్డు చైర్మన్లు, సభ్యులు, సేవకులు పాల్గొన్నారు.
విజయనగరం టౌన్: రాష్ట్రంలో పీపీపీ విధానాన్ని రద్దు చేసి అన్ని మెడికల్ కళాశాలలను ప్రభుత్వమే నడిపించాలని ఏఐఎఫ్‌టీయూ జిల్లా నాయకులు రెడ్డి నారాయణరావు, ఎన్.అప్పలరాజురెడ్డి డిమాండ్ చేశారు. ఏఐఎఫ్‌టీయూ న్యూ ఆధ్వర్యంలో ఆదివారం గాంధీ పార్కు నుంచి గంటస్తంభం వరకూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో పది ప్రభుత్వ కళాశాలలను లీజుకిచ్చే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, జీవో నంబరు 107, 108లను రద్దు చేసి 100శాతం ఎంబీబీఎస్ సీట్లను ప్రభుత్వ కోటాలో భర్తీ చేయాలన్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రైవేటు కంపెనీలకు అప్పగించాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలను ప్రభుత్వమే అందుబాటులోకి తీసుకురావాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో గుజ్జూరు శంకరరావు, గోవింద్, త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు.