
పది చోరీ కేసుల్లో నిందితుడి అరెస్ట్
పార్వతీపురం రూరల్: పది చోరీ కేసులకు సంబంధించిన నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నట్లు పార్వతీపురం రూరల్ సీఐ గోవిందరావు విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన సమావేశలో మాట్లాడుతూ జియ్యమ్మవలస మండలం బట్లభద్ర గ్రామానికి చెందిన తామడ సంతోష్ రాత్రి వేళల్లో బయట పడుకునేవారి ఇళ్లల్లోకి వెళ్లి బంగారు ఆభరణాలు, నగదు చోరీకి పాల్పడుతున్నట్లు తెలిపారు.
ఈ మేరకు నిందితుడ్ని బలిజిపేటలో అదుపులోకి తీసుకున్నట్లు సీఐ చెప్పారు. నిందితుడి నుంచి 10తులాల బంగారు ఆభరణాలు, రూ.13వేల నగదుతో పాటు బొబ్బిలి ప్రాంతానికి చెందిన ద్విచక్ర వాహనదారుడిని మోసం చేసి బైక్‌తో పరారైన కేసులో ఆ ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసు పురోగతికి సహకరించిన పోలీసు అధికారులను ఈ సందర్భంగా సీఐ అభినందించారు. సమావేశంలో సీసీఎస్ పోలీసు అధికారులతో పాటు బలిజిపేట, కొమరాడ, సీతానగరం, పార్వతీపురం రూరల్ ఎస్సైలు, సీసీఎస్ సిబ్బంది ఉన్నారు.
వివరాలు తెలిపిన రూరల్ సీఐ గోవిందరావు