
స్మార్ట్ మీటర్లపై.. లోకేష్ నోరు మూగబోయిందా?
● వామపక్ష, ప్రజాసంఘాల ఐక్యవేదిక నేతల ఆగ్రహం
విజయనగరం గంటస్తంభం: ఆంధ్రప్రదేశ్ ప్రజలను విద్యుత్ చార్జీలు, అదానీ స్మార్ట్ మీటర్లతో నిలువు దోపిడీ చేస్తున్న చంద్రబాబు నాయకత్వంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వ నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా సీపీఐ, సీపీఎం, ప్రజా సంఘాల ప్రజా వేదిక నేతృత్వంలో దశల వారీ పోరాటాలు నిర్వహిస్తామని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్, తమ్మినేని సూర్యనారాయణలు తెలిపారు. రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా మంగళవారం విజయనగరం కలెక్టర్ కార్యాలయం వెనుక ఉన్న విద్యుత్ సబ్‌స్టేషన్ దగ్గర ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ..ప్రతిపక్షంలో చంద్రబాబు ఉండి బాదుడే బాదుడు అనే కార్యక్రమాలు చేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే చార్జీలు పెంచబోమని ఇప్పటికే భారంగా ఉన్న చార్జీలు తగ్గిస్తామని ఎన్నికల ప్రణాళికలో హామీలు ఇచ్చి నేడు ఆ హామీని విస్మరించడం అంటే ఒడ్డు చేరాక తెప్ప తగలేసిన చందాన ఉందని విమర్శించారు. స్మార్ట్ మీటర్లు పగలగొట్టండని చంద్రబాబు సుపుత్రుడు లోకేష్ ఆనాడు పిలిపునిచ్చారని నేడు అదే స్మార్ట్ మీటర్లు ఇంటింటికి వచ్చి బిగిస్తుంటే లోకేష్ నోరు మెదపకుండా ప్రజలకు నమ్మకద్రోహం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజలను దోచుకోవడానికి పాలకులు పూనుకుంటున్నారన్నారు. అదానీ స్మార్ట్ మీటర్లు రద్దు చేసే వరకు, ట్రూ అప్ చార్జీల విధానాన్ని తొలగించి, అదనపు భారాలు తగ్గించేవరకు, సెకీ ఒప్పందాలు రద్దు చేసే వరకు దశల వారీ పోరాటం చేస్తామని, ఈ పోరాటంలో ప్రజలందరూ సహకరించి ప్రత్యక్ష భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎస్.రంగరాజు, ఏపీ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు బాయి రమణమ్మ, బూర వాసు, రెడ్డి శంకరరావు, పి.రమణమ్మ, రాము తదితరులు పాల్గొన్నారు.
స్మార్ట్ మీటర్లను రద్దుచేయాలి
పార్వతీపురం: ప్రజాభిప్రాయానికి భిన్నంగా బిగిస్తున్న అదానీ స్మార్ట్‌మీటర్లను వెంటనే రద్దుచేయాలని వామపక్ష, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం పార్వతీపురం పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి విద్యుత్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలపై విద్యుత్ సుంకాల రూపంలో రూ.12,717కోట్ల బాదుడుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందన్నారు. విద్యుత్ స్మార్ట్ మీటర్లతో శాశ్వత దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి అదానీ స్మార్ట్‌మీటర్లు, సోలార్, విద్యుత్ ఒప్పందాలతో కూటమి ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని ధ్వజమెత్తారు. ఇప్పటికే పెరిగిన విద్యుత్ చార్జీలతో భారం మోయలేక ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు. సూపర్ సిక్స్ హామీలు నత్తనడకన సాగుతుండగా, ప్రజలపై భారాలు వేగంగా మోపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదాని స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించిన టీడీపీ నేడు స్మార్ట్‌మీటర్లను ఎలా బిగిస్తుందని ప్రశ్నించారు. స్మార్ట్‌మీటర్లు బిగిస్తే బద్దలు కొట్టండి అని స్వయంగా నారా లోకేష్ పిలుపునిచ్చారని, నేడు అందుకు విరుద్ధంగా బిగిస్తున్నారని దుయ్యబట్టారు. స్మార్ట్‌మీటర్ల బిగింపు కార్యక్రమాన్ని నిలుపుదల చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు జి.వెంకటరమణ, కె.మన్మథరావు, రైతు కూలీ సంఘ నాయకుడు డి.వర్మ, పి.ఈశ్వరరావు, ఎం.కృష్ణమూర్తి, బి.దాసు, పి.సంగం, పి. శ్రీనునాయుడు, బాషా సూరిబాబు, బి.లక్ష్మి, జి.సర్వేశ్వరరావు, రాము, బలరాం, పి.రంజిత్ కుమార్, ఈవీనాయుడు, జి.తులసి, ఎం. గౌరి, బి.జయమ్మ, పి.సన్యాసిరావు, ఎస్.ఉమ తదితరులు పాల్గొన్నారు.

స్మార్ట్ మీటర్లపై.. లోకేష్ నోరు మూగబోయిందా?