
గిరిజన మహిళంటే చిన్నచూపా..?
● సర్పంచ్‌కు ప్రోటోకాల్ ఉండదా..
● పింఛన్ల పంపిణీకి హాజరు కావద్దా
● అనారోగ్యమని తెలిసీ అవహేళన
● గిరిజన మహిళా సర్పంచ్ ఆవేదన
శృంగవరపుకోట: ప్రజాస్వామ్య వ్యవస్థలో గిరిజన ప్రజాప్రతినిధులకు ప్రోటోకాల్ వర్తించదా? గిరిజన మహిళనని చిన్నచూపా? అంటూ మండలంలోని మూలబొడ్డవర గ్రామ గిరిజన మహిళా సర్పంచ్ దేవాపురపు మీనా మంగళవారం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు గ్రామసచివాలయంలో పలువురు గ్రామస్తులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొత్త పింఛన్ల పంపిణీని కనీసం తనకు చెప్పకుండా చేశారని, ప్రోటోకాల్ గిరిజన సర్పంచ్‌లకు ఉండదా? అని ప్రశ్నించారు. పంచాయతీ కార్యదర్శి తనను ఎస్టీ మహిళనని లోకువగా చూస్తున్నారని, ఉద్యోగం వదిలేసి రాజకీయాలు చేస్తున్నారని, దీనివల్ల అభివృద్ధి ఆగిపోయి, గ్రామంలో విభేదాలు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. పంచాయతీకి రెగ్యులర్ కార్యదర్శిని ఏర్పాటు చేయాలి. పాతికకు పైగా గిరిశిఖర గ్రామాలున్న రెండు పెద్ద గిరిజన పంచాయతీలైన ధారపర్తి, బొడ్డవరలకు ఒక్క కార్యదర్శిని ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. గిరిజన పంచాయతీలన్న చిన్నచూపుతోనే అధికారులు ఇలా చేస్తున్నారన్నారు. రెండు పంచాయతీలకు ఒక్కరే కార్యదర్శి కావడంతో అక్కడ, ఇక్కడ ఉన్నామని చెబుతూ కాలక్షేపం చేస్తున్నారన్నారు. సర్పంచ్ ఆచూకీ చెబితే బహుమతి ఇస్తామని వాట్సాప్ గ్రూప్స్‌లో ఎవరో పంపిన మెసేజ్‌లు ఎంపీటీసీ ఫార్వర్డ్ చేయడం సరికాదని, తప్పు చేస్తే జనం మధ్యనే నిలదీయాలన్నారు. ఆరోగ్యం బాగాలేక ఆస్పత్రికి వెళ్లానని తెలిసీ ఎంపీటీసీ తనను హేళన చేయడం అత్యంత బాధాకరమన్నారు.
రెగ్యులర్ సెక్రటరీని నియమించాలి
ఈ సందర్భంగా సచివాలయం నుంచి కార్యదర్శికి సర్పంచ్ మీనా ఫోన్ చేసి తనకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని అడిగితే కార్యదర్శి కాల్ కట్ చేయడంతో ఇదీ మా కార్యదర్శి పనితీరు చూశారుగా అన్నారు. ఇదే విషయాన్ని కలెక్టర్ గ్రీవెన్స్‌సెల్‌లో ఫిర్యాదు చేశామని, అధికారులు చర్యలు తీసుకుని, బొడ్డవర పంచాయతీకి రెగ్యులర్ సెక్రటరీని నియమించాలని కోరారు. సమావేశంలో గ్రామపెద్ద డి.సన్యాసినాయుడు మాట్లాడుతూ ఆర్నెలలుగా సర్పంచ్ పని చేయకపోతే ఎంపీటీసీ చేశారా? జనం మధ్య తేల్చండి. మేము పనిచేయలేదని, అందుబాటులో లేమని చెబితే ఇప్పుడే సర్పంచ్‌తో రాజీనామా చేయిస్తానన్నారు. పనులకు సర్పంచ్ కావాలి కానీ పింఛన్లు పంపిణీ చేసినప్పుడు ప్రోటోకాల్ అవసరం లేదా? గిరిజనులం అని చులకన చేస్తున్నారని వాపోయారు. 90శాతం ఓటర్లు గిరిజనులు, దళితులు, బీసీలు ఉన్నా ఇక్కడ రాజరికం చేయాలనుకోవడం, అధికారులను బెదిరించి గిరిజన నేతలను ఇబ్బందులు పెట్టడం సరికాదని గిరిజన సంఘం నేత జె.గౌరీష్ అన్నారు.

గిరిజన మహిళంటే చిన్నచూపా..?