
ఎవరీ కిల్లో స్వప్న..?
పాలకొండ రూరల్: కిల్లో స్వప్న.. తల్లికి వందనం పథకానికి అనర్హులైనవారి నోట తరచూ వినిపిస్తున్న పేరు. ఈమె ఎవరో ఎవరికీ తెలియదు. ఆమె పేరుమాత్రం అధికమంది పిల్లలకు తల్లిగా నమోదైంది. ఎవరో తెలుసుకుందామనుకుంటే ఆమె ఆధార్ నంబర్‌లో చివరి సంఖ్యలు– 9999గా ఆన్‌లైన్‌లో కనిపిస్తోంది. పిల్లల తల్లి స్థానంలో స్వప్న పేరు నమోదైన ఏ ఒక్కరికీ తల్లికివందనం పథకం వర్తించ లేదు. ఆ పేరు మీద అనర్హతకు గల పలు కారణాలు సాంకేతికంగా కనిపిస్తున్నాయంటూ పిల్లల తల్లితండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్య ఎవరి చెప్పాలో తెలియక... ఫిర్యాదు చేసేందుకు ఎక్కడి వెళ్లాలో అర్ధంకాక ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో తల్లికి వందనం పథకం పొందడం ఓ ప్రహసనంగా మారింది. ఏ పాఠశాల, సచివాలయం వద్ద చూసినా అర్హత ఉండి లబ్ధి కోల్పోయిన పిల్లల తల్లితండ్రులే కనిపిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ‘అమ్మ ఒడి’ అందుకున్నవారి పేర్లు ఈ ఏడాది తల్లికివందనం పథకం అనర్హుల జాబితాలో చేరడం చర్చనీయాంశంగా మారింది. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ డివిజన్‌లోపాటు సమీప విజయనగరం జిల్లా రేగిడి మండలంలో పలువురు పిల్లల తల్లిగా ఈ కిల్లో స్వప్న పేరు నమోదైంది.
● ప్రతీ పది మంది అనర్హులలో ఏడుగురు విద్యార్థుల తల్లిగా కిల్లో స్వప్న పేరు నమోదే కారణంగా కనిపిస్తోంది. ఆమె పేరు ఉన్న పిల్లల కుటుంబ సభ్యులు ప్రభుత్వ, అనుబంధ రంగ ఉద్యోగులు గా, పది ఎకరాల భూమి, అధిక విద్యుత్ బిల్లులు, భారీ భవనాలు, నాలుగు చక్రాల వాహనాలు ఉన్న ట్టు, పథకానికి అనర్హులుగా ఆన్‌లైన్‌లో చూపిస్తోంది. అసలు ఎవరీ స్వప్న అన్న ప్రశ్నకు సచివాలయాలు, పాఠశాలల యాజమాన్యాల వద్ద సమాధానం లేకపోవడం గమనార్హం. ఎవరికి ఫిర్యాదుచేయాలో తెలియడం లేదంటూ దుప్పాడ వరలక్ష్మి, సంతోషి, శ్రావణి, ఉష, పైల రమ ణమ్మ, బుజ్జమ్మ, విమల, ఎస్.ఈశ్వరమ్మ తదితరులు మీడియా వద్ద శనివారం వాపోయారు.
తల్లికి వందనం అనర్హతకు ఆమె పేరే ఓ కారణం
అధిక మంది పిల్లల తల్లిగా స్వప్నపేరు నమోదు
దీనిని సరిచేసేందుకు చేతులెత్తేస్తున్న అఽధికారయత్రాంగం
ఆవేదనలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు

ఎవరీ కిల్లో స్వప్న..?