
ఎల్‌ఎంసీ పోస్టు... రూ.10 లక్షలు!
● విద్యుత్ శాఖలో రూ.38 లక్షలకు నాలుగు పోస్టుల బేరం? ● ప్రజాప్రతినిధుల మధ్య ఏకాభిప్రాయం కుదరక కలగని మోక్షం
సాక్షి, పార్వతీపురం మన్యం: విద్యుత్ శాఖలో లోడ్ మోనటరింగ్ సెల్ (ఎల్‌ఎంసీ) విభాగంలో పాలిటెక్నికల్ విద్యార్హతతో భర్తీచేసే నాలు గు పోస్టులకు భారీ ‘ధర’ పలికినట్టు సమాచారం. కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయనున్న ఈ పోస్టులను టెండరు ద్వారా కాంట్రాక్టర్‌కు అప్పగిస్తారు. కొత్త సర్కిల్ కార్యాలయం కావడంతో ఈ నాలుగు పోస్టులతో పాటు.. మూడు స్వీపర్ పోస్టులు మంజూరయ్యాయి. ఎల్‌ఎంసీ విభాగ పోస్టులకు గత నెలలోనే టెండర్ ప్రక్రియ చేపట్టారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి వీరు విధుల్లో చేరిపోవాల్సి ఉంది. ఒక్కొక్కరికీ రూ.25 వేలు వేతనం చొప్పున టెండరు దక్కించుకున్న కాంట్రాక్టరే నేరుగా వారికి చెల్లిస్తారు. ఈ పోస్టులకు ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వకుండానే కేవలం ప్రజాప్రతినిధుల సిఫారసులతో నియామక ప్రక్రియ పూర్తి చేసేశారు. మొత్తం నాలుగు ఖాళీల్లో ఒకటి కార్పొరేట్ కార్యాలయానికి చెందిన ఒక అధికారి తమ వారి పేరును సిఫారసు చేసుకోగా.. మిగిలిన మూడు పోస్టులూ జిల్లాకు చెందిన ఓ కీలక ప్రజాప్రతినిధి చేతుల్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఒక్కో పోస్టుకూ రూ.10 లక్షల వరకు బేరం పె ట్టి, అమ్ముకున్నట్లు ఆ శాఖలోనే వినిపిస్తోంది. మొత్తంగా నాలుగు పోస్టులకూ రూ.38 లక్షల వరకు పలికినట్లు సమాచారం. పార్వతీపురం నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధికి విషయం తెలిసి, తనకు తెలియకుండా ఎలా వేసుకుంటారని అభ్యంతరం పెట్టడంతో వివాదం రేగినట్లు తెలిసింది. మొత్తం ప్రక్రియలో ఈపీడీసీఎల్ పార్వతీపురం సర్కిల్ ఎస్‌ఈ పాత్ర కూడా నామమాత్రమైపోయిందని కార్యాలయ వర్గాల భోగట్టా. ఇద్దరు ప్రజాప్రతినిధుల మధ్య పోస్టు ల పంపకంలో వివాదం రేగడం వల్లే నేటికీ వారు విధుల్లో చేరకుండా ఉండిపోయారు.
అంత మొత్తంలో వసూలా?
లోడ్ మోనటరింగ్ సెల్ విభాగంలో భర్తీ చేస్తు న్న ఈ నాలుగు పోస్టులూ కేవలం కాంట్రాక్టు పద్ధతిలోనివే. ఏటా కాంట్రాక్టును పొడిగించా ల్సి ఉంటుంది. విద్యుత్ సరఫరా పరిస్థితిని ఎ ప్పటికప్పుడు గమనిస్తూ.. రీడింగ్ ఎంత తగ్గింది, ఏ మేరకు వచ్చింది అన్న వివరాలు పరిశీలిస్తూ. పైకి పంపడం వీరి ప్రధాన విధి. ఈ పోస్టు కోసం రూ.10 లక్షలు చొప్పున లంచంగా తీసుకోవడం.. నిరుద్యోగులు ఇవ్వడంపైనా ఆ శాఖలోని ఉద్యోగులే ఆశ్చర్యపోతున్నారు.