
సత్వర వైద్యంతో మలేరియా నివారణ
గుమ్మలక్ష్మీపురం: మలేరియా బాధితులకు సత్వరమే మెరుగైన వైద్యసేవలు అందించాలని మలేరియా నివారణ విభాగం డిప్యూటీ డైరెక్టర్ రామనాథరావు అన్నారు. గుమ్మలక్ష్మీపురం మండలంలోని దుడ్డుఖల్లు పీహెచ్‌సీ పరిధిలోని జర్న గ్రామంలో మలేరియాతో బాధపడుతూ చికిత్స పొందిన వారిని శుక్రవారం కలిశారు. వైద్యసేవలపై ఆరా తీశారు. పీహెచ్‌సీలోని ల్యాబ్‌ను తనిఖీ చేశారు. ల్యాబ్‌లో చేపడుతున్న పరీక్షలతో పాటు జ్వరాల అదుపునకు చేపడుతున్న చర్యలపై వైద్యాధికారి ప్రవీణ్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రేగిడి పీహెచ్‌సీ పరిధిలోని పెంగవ గ్రామాన్ని సందర్శించారు. దోమల లార్వా ప్రదేశాలను గుర్తించి ఫ్రైడే డ్రైడే ప్రాముఖ్యతను గ్రామస్తులకు వివరించారు. రేగిడి పీహెచ్‌సీ వైద్యులు, వైద్య సిబ్బందితో మాట్లాడుతూ జ్వరంతో వచ్చే ప్రతిరోగికి మలేరియా పరీక్షలు నిర్వహించాలని, నిర్థారణ అయితే సత్వరమే మందులను అందజేసి, పర్యవేక్షణతో కూడిన వైద్య సేవలను అందించాలని సూచించారు. ఆయన వెంట జిల్లా మలేరియా నివారణ అధికారి వై.మణి, సహాయ అధికారి సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.