
గిరిజన గురుకులాల్లో.. ఇంటర్ చదువుకు ఆసక్తి
● జిల్లాలో 1030 సీట్లకు 2,500కు పైగా దరఖాస్తులు ● సీతంపేట ఐటీడీఏ పరిధిలో ఒకే ఒక బాలికల కళాశాల ● ఇక్కడ 140 సీట్లకు 507 దరఖాస్తులు ● పదోతరగతి మార్కుల ఆధారంగా సీట్ల కేటాయింపు ● నేడు నోడల్ కళాశాలల్లో కౌన్సెలింగ్
సీతంపేట:
గిరిజన గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంట ర్మీడియట్ ఇంగ్లిష్ మీడియం చదువుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. 2025–26 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు తీవ్ర పోటీ నెలకొంది. జిల్లాలో 8 గిరిజన గురుకుల కళాశాలల్లో ఇంటర్మీడియట్‌లో 1030 సీట్లకు 2,500 మంది దరఖాస్తు చేశారు. సీతంపేట, పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో ఉన్న నోడల్ గిరిజన గురుకుల కళాశాలల్లో ప్రవేశాలకు శనివారం కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. పదోతరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపీసీ, బైపీసీ,హెచ్‌ఈసీ, సీఈసీ, ఒకేషనల్ ఎఅండ్‌టీ, సీజీఏ గ్రూపుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ఏడాది జిల్లాలోని గిరిజన సంక్షేమ ఆశ్రమపాఠశాలలు, కేజీబీవీలు, గురుకులాల్లో సుమారు 3 వేల మంది విద్యార్థులు పదోతరగతి పాసయ్యారు. అధిక మార్కులు సాధించిన వారికే గురుకులాల్లో సీట్లు లభించనున్నాయి.
సదుపాయాలతో కూడిన విద్యాబోధన
గిరిజన గురుకులాల్లో చేరే విద్యార్థులకు ఉచిత భోజనం, వసతితో పాటు వైద్య సదుపాయాలు, యూనిఫారం, పుస్తకాలు, ఇతర మెటీరియల్‌ను ప్రభుత్వం సమకూర్చుతుంది. ఈ కళాశాలల్లో సీటు లభించిందంటే కార్పొరేట్ కళాశాలల్లో సీటు లభించినంత ఫలితం ఉంటుంది. సీతంపేట ఐటీడీ ఏ పరిధిలో సీతంపేట బాలికల గురుకుల జూనియ ర్ కళాశాల ఒక్కటే ఉండడంతో ప్రవేశాలకు అధిక డిమాండ్ ఉంది. 140 సీట్లకు 507 మంది బాలికలు దరఖాస్తు చేశారు. ఇందులో బైపీసీ గ్రూపునకు 362 మంది దరఖాస్తు చేయడం గమనార్హం.
సీట్ల కేటాయింపు ఇలా...
జనరల్ గ్రూపులు ప్రతీ గ్రూపుకు 40 సీట్లు కేటాయించారు. దీనిలో ఎస్టీలకు 36, ఎస్సీ, బీసీ, ఓసీ, ఏఈక్యూ (ఏజెన్సీ ఎంప్లాయ్ కోటా) ఒక్కో సీటు చొప్పున భర్తీ చేస్తారు. ఒకేషనల్ ఎఅండ్‌టీ 20, సీజీఏ గ్రూపులో 30 సీట్లు పూర్తిస్థాయిలో ఎస్టీలకు కేటాయించారు.
కౌన్సెలింగ్‌కు అభ్యర్థులు
తీసుకురావాల్సినవి...
టీసీ, స్టడీ సర్టిఫికెట్ ( 6 నుంచి 10వ తరగతి వరకు), మార్కుల జాబితా, కులధ్రువీకరణ పత్రం (ఒరిజనల్), తల్లి,దండ్రులు, విద్యార్థి ఆధార్ జిరాక్స్‌లు, బ్యాంకు ఖాతా జిరాక్స్ (తల్లి, విద్యార్థి), 6 పాస్‌ఫొటోలు, అన్ని సర్టిఫికె ట్లు 3 సెట్ల జిరాక్స్ కాపీలు.

గిరిజన గురుకులాల్లో.. ఇంటర్ చదువుకు ఆసక్తి