
సజావుగా ఇంటర్మీడియట్ ప్రవేశాల కౌన్సెలింగ్
సీతంపేట:
గిరిజన గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ ప్రవేశాలకు శనివారం సీతంపేట బాలుర గురుకుల కళాశాలలో నిర్వహించిన కౌన్సెలింగ్ సజావుగా సాగింది. పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినికి స్థానిక బాలికల జూనియర్ కళాశాలలో మొదటి సీటు కేటాయిస్తూ ఐటీడీఏ పీఓ సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి ప్రవేశపత్రం అందజేశారు. బాలికల కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, హెచ్‌ఈసీ గ్రూపుల్లో 40 సీట్లు చొప్పున భర్తీ చేశారు. వృత్తివిద్యాకోర్సు అయిన ఎఅండ్‌టీ (అకౌంటింగ్ అండ్ ట్యాక్సిషేన్)లో 20 సీట్లలో విద్యార్థినులను జాయిన్ చేసుకున్నారు. 507 మంది బాలికలు దరఖాస్తు చేసుకోగా 450 మంది కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. బాలుర కళాశాలలో ఎంపీసీలో 40కి గాను 36 సీట్లు భర్తీ అయ్యాయి. బైపీసీలో 40కి 38, హెచ్‌ఈసీలో 38 సీట్లలో విద్యార్థులు ప్రేవేశాలు పొందారు. సీజీఏ 30కి 30, ఏఅండ్‌టీ 20కి 20 సీట్లు భర్తీ చేశారు. మొత్తం 170కి గాను 162 భర్తీ అయ్యాయి. 263 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 200ల మంది హాజరయ్యారు. కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ డీడీ అన్నదొర, గురుకులం సెల్ ఇన్‌చార్జి వెంకటరమణ, ప్రిన్సిపాళ్లు కృష్ణమోహన్, పి.సూర్యకుమారి తదితరులు పాల్గొన్నారు.